జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో దుబాయ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని స్వదేశానికి తిరిగివచ్చారు. రెండు రోజుల పర్యటన కోసం ఆయన సౌదీ అరేబియాకు వెళ్లారు. బుధవారం ఆ దేశ ప్రభుత్వం ఇచ్చే అధికారిక విందులో పాల్గొనాల్సివుంది. కానీ, పహల్గామ్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయి, 38 మందికిపై పైగా పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. దీంతో ఆయన మంగళవారం రాత్రి హుటాహుటిన సౌదీ పర్యటనను ముగించుకుని జెడ్డా నుంచి బయలుదేరి వచ్చారు. బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న ఆయన ఎయిర్‌పోర్టులోనే అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.
ఇందులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్తీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానికి దాడి జరిగిన తీరును వివరించారు. కాగా ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన జాతీయ భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ జరుగనుంది.
మరోవైపు, ఇప్పటికే శ్రీనగర్ చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా... భద్రతా ఉన్నతాధికారులతో సమావేశమై ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు. బుధవారం ఆయన దాడి జరిగిన ప్రాంతమైన పహల్గామ్ ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తారు.
కాశ్మీర్‌లోని మినీ స్విట్జర్లాండ్‌గా పేరొంది. బైసరన్ ప్రాంతంలో పర్యాటక ప్రాంతాలను తిలకించేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రమూకలు విరుచుకుపడి పాశవిక దాడి జరిపిన విషయం తెల్సిందే. ఈ ఘటనపై 38 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది వరకు గాయపడ్డారు.