జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలోని పర్యాటకులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదిని జాతీయ మీడియా సంస్థలు గుర్తించి ఓ ఫోటోను రిలీజ్ చేశాయి. ఫోటోలో ఉగ్రవాది రైఫిల్ పట్టుకుని పరుగెత్తుతూ కనిపిస్తున్నాడు. చేతిలో ఆయుధాలు పట్టుకుని పఠానీ సూట్ ధరించి కనిపిస్తున్నాడు. ఈ ఫోటోను మంగళవారం రాత్రి 1 నుంచి 2 గంటల ప్రాంతంలో జమ్మూకాశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్, సైన్యంతో పంచుకున్నట్టు సమాచారం.
జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో కనీసం 26 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడినట్టు సమాచారం. కాగా, ఈ దాడిలో 8 నుంచి 10 మంది ఉగ్రమూకలు పాల్గొన్నట్టు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. వారిలో 5 నుంచి 7 మంది దాయాది పాకిస్థాన్ నుంచి వచ్చినట్టు పేర్కొంటున్నాయి. కాల్పుల తర్వాత సమీపంలోని అడవిలోకి పారిపోగా, వారి కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.