చైనాకు ప్రత్యామ్నాయ పెట్టుబడుల కేంద్రంగా భారత్ : సీఎన్ఎన్ నివేదిక

ఠాగూర్

గురువారం, 9 మే 2024 (13:48 IST)
చైనాకు ప్రత్యామ్నాయ పెట్టుబడుల కేంద్రంగా భారత్ అవతరించనుందని ప్రముఖ జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ తన నివేదికలో అంచనా వేసింది. ముఖ్యంగా, 21వ శతాబ్దపు ఆర్థిక శక్తిగా భారత్ అవతరించనుందని పేర్కొంది. భారత్ ఆర్థిక వ్యవస్థను సూపర్ పవర్‌గా రూపాంతరం చెందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, దేశీయ దిగ్గజ వ్యాపారవేత్తలు ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీలు కీలక పాత్ర పోషిస్తున్నారని, అందుకోసం బాటలు వేస్తున్నారని విశ్లేషించింది.
 
అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఎంచుకున్న రంగాల్లో అదానీ, అంబానీ పెట్టుబడులు పెట్టడాన్ని ఇన్వెస్టర్లు అభినందిస్తున్నారని సీఎన్ఎన్ రిపోర్ట్ విశ్లేషించింది. అభివృద్ధిని ప్రోత్సహించేందుకుగానూ బీజేపీ ప్రభుత్వం రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల నిర్మాణానికి కోట్లాది రూపాయలు వెచ్చించడం ద్వారా భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల పరివర్తనను ప్రారంభించిందని పేర్కొంది. మోడీ ప్రభుత్వం డిజిటల్ కనెక్టివిటీని భారీగా ప్రోత్సహిస్తోందని, ఈ విధానం వాణిజ్యం, రోజువారీ జీవితాలను మరింత మెరుగుపరుస్తోందని కొనియాడింది.
 
దేశంలో విప్లవాత్మక మార్పుల్లో అదానీ, అంబానీ ఇద్దరూ కీలక వ్యక్తులుగా మారారని ప్రశంసించింది. 2023లో భారత్ 3.7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉందని, మోడీ పదేళ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ 4 స్థానాలు ఎగబాకి యునైటెడ్ కింగ్ డమ్‌ను అధిగమించిందని ప్రస్తావించింది. 2027 నాటికి అమెరికా, చైనాల తర్వాత మూడో స్థానంలో భారత ఆర్థిక వ్యవస్థ నిలవనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారని సీఎన్ఎన్ రిపోర్ట్ విశ్లేషించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు