దేశంలో ఆక్సిజనే కాదు.. మోడీ - షాలు కూడా కనిపించడం లేదు : రాహుల్

గురువారం, 13 మే 2021 (13:38 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ప్రతి రోజూ లక్షలాది మంది ఈ వైరస్ బారినపడుతున్నారు. వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. ఆస్పత్రుల్లో పడకలు లభించక అనేక మంది చనిపోతున్నారు. అలాగే ఆక్సిజన్ కూడా దేశ వ్యాప్తంగా నెలకొంది. పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ లేక అనేకమంది మంది కోవిడ్ రోగులు మృత్యువాతపడుతున్నారు. 
 
ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విరుచుకుపడుతున్నారు. వైరస్‌ కట్టడిలో కేంద్రం విఫలమైందంటూ ఆరోపించిన ఆయన.. తాజాగా గురువారం మరోసారి ట్విట్టర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
'మహమ్మారి సమయంలో టీకాలు, ఆక్సిజన్‌, మందులతో పాటు ప్రధాని కూడా కనిపించడం లేదు' ఇక మిగిలినవి సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు, ఔషధాలపై జీఎస్‌టీ, అక్కడ ఇక్కడ ఉన్న ప్రధాని ఫొటోలు' అంటూ ట్వీట్‌ చేశారు. రెండో దశలో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆక్సిజన్‌, మందులు, వ్యాక్సిన్ల కొరతపై రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. 
 
మరోవైపు, దేశంలో గడచిన 24 గంటల్లో కొత్త‌గా 3,62,727 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది. వాటి ప్రకారం, బుధవారం 3,52,181 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,37,03,665కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 4,120 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య  2,58,317కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  1,97,34,823 మంది కోలుకున్నారు. 37,10,525 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 17,72,14,256  మందికి వ్యాక్సిన్లు వేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు