ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కోసం రూ.2 వేలు విరాళం ఇచ్చారు. పార్టీ ఫండ్ కోసం ఆయన ఈ మొత్తం ఇచ్చారు. అలాగే, మిగిలిన వారు కూడా పార్టీకి విరాళాలు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అధికార బీజేపీ విరాళాలకు పిలుపునిచ్చింది. ఇందులోభాగంగా, ఆయన తన వంతుగా రూ.2 వేలు ఇచ్చారు.
వికసిత్ భారత్ నిర్మాణానికి మరింత వెన్నుదన్నుగా నిలిచేందుకు భారతీయ జనతా పార్టీకి సంతోషంగా విరాళం అందించాను అని వెల్లడించారు. దేశ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, నమో యాప్ ద్వారా విరాళాలు అందించాలని కోరుతున్నానని మోడీ ట్వీట్ చేశారు. ఈ మేరకు నమో యాఫ్ ఫండింగ్ ఫేజ్ లింకును కూడా పంచుకున్నారు. కాగా, నమో యాప్ ద్వారా రూ.5 నుంచి గరిష్టంగా రూ.2 వేల వరకు విరాళంగా ఇచ్చారు.
లోక్‌సభ ఎన్నికల బరిలో సుష్మా స్వరాజ్ కుమార్తె
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సురి స్వరాజ్ బరిలోకి దిగుతున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్నా బాన్సురి స్వరాజ్.. దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలోని న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. రాజధాని పరిధిలోని ఐదు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఇందులో బాన్సురి స్వరాజ్ పేరు కూడా ఉంది. ఈమె బరిలోకి దిగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తనకు టికెట్ కేటాయించిన బీజేపీ అధిష్టానానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
దీనిపై ఆమె స్పందిస్తూ, 'నాకెంతో సంతోషంగా ఉంది. నాకీ అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాకు, ప్రతి బీజేపీ కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 400 లోక్ సభ స్థానాలు గెలవాలన్న బీజేపీ లక్ష్య సాధన కోసం నా వంతు కృషి చేస్తాను. నరేంద్ర మోడీని దేశ 'ప్రధాన సేవకుడు'గా మూడోసారి కూడా గెలిపించేందుకు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త పాటుపడతారు' అని బాన్సురి స్వరాజ్ తెలిపారు.
కాగా, 40 ఏళ్ల బాన్సురి స్వరాజ్ ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. అంతకుముందు, బ్రిటన్‌లోని వార్విక్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్‌లో పట్టా అందుకున్నారు. గతేడాది ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో కన్వీనర్‌గా నియమితులయ్యారు. బాన్సురి గతంలో హర్యానా రాష్ట్ర అదనపు అడ్వొకేట్ జనరల్‌గానూ వ్యవహరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.