దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరిగింది. ఆక్సిజన్ సపోర్ట్ అవసరమవుతున్న పేషెంట్ల సంఖ్య ఎక్కువవుతోంది. దేశవ్యాప్తంగా చాలా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో పేషెంట్లు మృతి చెందారు.
ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. మోదీ చిన్నమ్మ నర్మదా బెన్(80) మంగళవారం (ఏప్రిల్ 27) కరోనాతో మృతి చెందారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆమె... అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.ఈ విషయాన్ని ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోదీ వెల్లడించారు.
'మా చిన్నమ్మ నర్మదాబెన్ న్యూ రణదీప్ కాలనీలో తన పిల్లలతో కలిసి నివసిస్తోంది. 10 రోజుల క్రితం కరోనాతో ఆరోగ్యం క్షీణించడంతో సివిల్ ఆస్పత్రిలో చేరింది. అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచింది.' అని ప్రహ్లాద్ మోదీ తెలిపారు. నర్మదా బెన్ భర్త,ప్రధాని మోదీ తండ్రి దామోదర్ దాస్ సోదరుడు జగ్జీవన్‌దాస్ చాలా ఏళ్ల క్రితమే మరణించారని తెలిపారు.