రాజకీయ నేతల వేతనాలపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. నిజాయితీగా పనిచేసే ఎంపీలకు వేతనాలు సరిపోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. తాజాగా ఆమె ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాజకీయాల్లో నిజాయితీగా పనిచేసే ఎంపీలకు వేతనం సరిపోవడం లేదన్నారు. తమతో ఉండే సిబ్బందికి జీతాలు ఇచ్చిన తర్వాత ఎంపీలకు మిగిలేది అంతంత మాత్రమేనని చెప్పారు. ప్రజాప్రతినిధులు, పీఏలతో కలిసి నియోజకవర్గాలకు వాహనాలలో వెళ్లేందుకు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో ఒక ప్రదేశం నుంచి మరో ప్రాంతానికి కనిసం 300 నుంచి 400 కిలోమీటర్ల దూరం ఉండటమే ఇందుకు కారణమన్నారు. పైగా, రాజకీయాలు చాలా ఖర్చుతో కూడుకున్నవన్నారు. ఎంపీలకు ఇచ్చే వేతనం ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. అందుకే మరో ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇప్పటికే చాలా మంది ఎంపీలకు వ్యాపారాలు ఉన్నాయని, మరికొందరు న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారని, ఇంకొందరు ఇతర వృత్తుల్లో రాణిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.