ఇక పట్టాలపైకి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

సోమవారం, 19 ఏప్రియల్ 2021 (09:37 IST)
దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి తీవ్రరూపం దాల్చింది. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా రోగులు విపరీతంగా పెరిగిపోయారు. ఫలితంగా ఆస్పత్రుల్లో పడకలతో పాటు.. ప్రాణవాయువు నిల్వలు కూడా నిండుకున్నాయి. దీంతో కేంద్రం అత్యవసర చర్యలు చేపట్టింది. ఈ చర్యలకు రైల్వే శాఖ కూడా తన వంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. ఆక్సిజన్ ప్రాంట్ల నుంచి ప్రాణవాయువును దేశ వ్యాప్తంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులోభాగంగా, ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లను నడపనున్నట్లు రైల్వేశాఖ ఆదివారం తెలిపింది. ఈ రైళ్ల రాకపోకలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేయనుంది. 
 
మెడికల్‌ ఆక్సిజన్‌కు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రైలు ద్వారా డిమాండ్‌ ఉన్నచోటుకు ఆక్సిజన్‌ను సరఫరా చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపారు. ఖాళీ ట్యాంకర్లు ముంబై సమీపం నుంచి సోమవారం బయల్దేరి వైజాగ్‌, జంషెడ్‌పుర్‌, రవుర్కెలా, బొకారోల నుంచి ద్రవ రూప ఆక్సిజన్‌ను నింపుతాయని చెప్పారు.
 
గతేడాది కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు తమ పరిధిలోని ఆసుపత్రుల్లో కొవిడ్‌ పడకలు ఏర్పాటు చేసిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారీ అదే తరహా సాయం అందించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ వివిధ శాఖలను కోరారు. ఈ మేరకు రక్షణ, రైల్వే, ఉక్కు, బొగ్గు, విద్యుత్తు, నౌకాయానం, విద్యాశాఖ కార్యదర్శులకు లేఖలు రాశారు. వీలైనచోట్ల ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు, లేబొరేటరీ సేవలు అందుబాటులోకి తేవాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు