రాజస్థాన్: సచిన్ పైలట్ తిరుగుబాటు... సంక్షోభంలో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం

సోమవారం, 13 జులై 2020 (14:12 IST)
రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభం ముంగిట నిలిచింది. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాత్‌పై ఆగ్రహంగా ఉన్న డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌, తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను తీసుకుని ఢిల్లీ వెళ్లారు.
 
ఇదిలా ఉంటే, రాజస్థాన్‌లోని తన ఎమ్మెల్యేలందరికీ కాంగ్రెస్ విప్ జారీ చేసింది. జైపూర్‌లోని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ ఇంట్లో సోమవారం ఉదయం 10.30 గంటలకు శాసనసభా పక్షం సమావేశం ఉందని, ఈ సమావేశంలో ఎమ్మెల్యేలందరూ ఉండడం తప్పనిసరి అని ఆదేశించింది.
 
కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశానికి సచిన్ పైలట్ హాజరుకారని వార్తా సంస్థ పిటిఐ తెలిపింది. కాంగ్రెస్ తన వద్ద 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని సచిన్ అన్నారు.
 
ముఖ్యమంత్రి కుర్చీ కోసం గెహ్లాత్ సచిన్‌ల మధ్య ఘర్షణ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. 2018లో రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం తర్వాత సీఎం పదవి కోసం ఈ ఇద్దరు నేతలు పోటీపడ్డారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ అశోక్‌ గెహ్లాత్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో, సచిన్‌ పైలట్‌ ఉపముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
 
సచిన్‌ పైలట్‌ ప్రస్తుతం ప్రదేశ్‌ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. అయితే సీఎం, డిప్యూటీ సీఎంల మధ్య అంతర్గత వైరం చాలా రోజులుగా కొనసాగుతోంది.
 
ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ స్పెషల్ ఆపరేషన్‌ గ్రూప్‌ పోలీసులు ముఖ్యమంత్రికి, ఉపముఖ్యమంత్రికి నోటీసులు జారీ చేసినప్పటి నుండి వీరి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.
 
వాస్తవానికి రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఎస్‌ఓజీ పోలీసులు సీఎం అశోక్ గెహ్లాత్, ఉపముఖ్యమంత్రి సచిన్‌ పైలట్, పార్టీ చీఫ్‌ విప్‌తోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రశ్నించడానికి నోటీసులు పంపారు.
 
ఈ నోటీసులు చాలా చిన్న విషయమని, కానీ మీడియాలో దీనికి భిన్నమైన అర్ధాలు తీస్తున్నారని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్‌ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
రాజస్థాన్‌లో నంబర్‌ గేమ్‌ 
రాజస్థాన్‌ శాసనసభలో కాంగ్రెస్‌కు 107మంది ఎమ్మెల్యేల బలం ఉంది. వీరిలో బీఎస్పీని వదిలి కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరుకాక 12-13మంది స్వతంత్ర ఎమ్మెల్యేల కూడా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు.
 
2018 ఎన్నికల్లో బీజేపీ 73స్థానాలను గెలుచుకుంది. ప్రస్తుతానికి కాంగ్రెస్‌ కూటమిలో బీజేపీకన్నా 48 మంది ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. సంఖ్యాపరంగా గెహ్లాత్‌ ప్రభుత్వం పటిష్టంగానే ఉంది.
 
ఇప్పుడు సచిన్‌ పైలట్‌ 25మందిని తనతో తీసుకెళ్లినా ప్రభుత్వానికి ఎలా ఢోకా లేదన్నారు జైపూర్‌కు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ నారాయణ్ బారెత్‌. "రాజస్థాన్‌లో పరిస్థితి మధ్యప్రదేశ్‌లో లాగా లేదు. ఇక్కడ బీజేపీకి, కాంగ్రెస్‌కు మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. సచిన్ పైలట్ ఎమ్మెల్యేలను, ప్రభుత్వాన్ని కూల్చలేరు" అని ఆయన అన్నారు.
 
మరోవైపు సచిన్‌ పైలట్‌ బీజేపీకి దగ్గరవుతున్నారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. "సచిన్‌ పైలట్‌ బీజేపీతో సన్నిహితంగా ఉంటే ఉండొచ్చు. కానీ బీజేపీ నుంచి ఆయన ఏం కోరుకుంటారో అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి కావాలన్నది ఆయన కోరిక. కానీ ఆయనకు అంత సంఖ్యాబలం లేదు'' అన్నారు నారాయణ్ బారెత్‌.
 
రాజస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభంలో కాంగ్రెస్‌ అంతర్గత రాజకీయ సంక్షోభం ఎక్కువగా కనిపిస్తోంది. సచిన్‌ పైలట్‌ తన స్థానం ఏంటో నిరూపించుకునేందుకు చేసే ప్రయత్నంగా విశ్లేషకులు దీన్ని భావిస్తున్నారు.
 
ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం జరుగుతోందా? 
ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర ఆరోపణలపై రాజస్థాన్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా సీఎం, డిప్యూటీ సీఎం సహా పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు.
 
ఈ విచారణలో భాగంగా ఇద్దరు స్థానిక నేతలను అరెస్టు చేశారు. ఎస్‌ఓజీ చీఫ్ అశోక్‌ రాథోడ్‌ ఈ అరెస్టులను ధృవీకరించారు. "దర్యాప్తు కొనసాగుతోంది, మరికొందరిని ప్రశ్నించాల్సి ఉంది." అని ఆయన బీబీసీతో అన్నారు.
 
అయితే పోలీసులు అరెస్టు చేసిన వారికి బీజేపీతో సంబంధం లేదని తేల్చి చెప్పింది. కాగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టినట్లే రాజస్థాన్‌లో కూడా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు