రసవత్తరంగా రాజస్థాన్ రాజకీయాలు - వెనక్కి తగ్గిన సచిన్ పైలెట్

సోమవారం, 13 జులై 2020 (12:01 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ సర్కారుకు బీజేపీ రూపంలో గండం పొంచివుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నేత సచిన్ పైలెట్ బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. దీంతో రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంక్షోభం తారాస్థాయికి చేరింది. 
 
దీంతో రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంక్షోభం అంచున ఉన్న ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తమకు 109 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, గెహ్లాట్‌ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని అధికార కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. 
 
ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌ తిరుబాటు నేపథ్యంలో ఆదివారం అర్థరాత్రి 2.30 గటలకు సీఎం గెహ్లాట్‌ ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించింది. సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తున్నామని, కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీల నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉన్నదని 109 మంది ఎమ్మెల్యేలు రాతపూర్వకంగా ఇచ్చారని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి అవినాశ్‌ పాండే ప్రకటించారు. 
 
మరికొంత మంది ఎమ్మెల్యేలు సీఎంతో ఫోన్‌లో మాట్లాడారని, సోమవారం ఉదయం వారు కూడా సంతకాలు చేయనున్నారని వెల్లడించారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు సీఎల్సీ సమావేశం జరుగుతుందని, ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా హాజరుకావాలని, ఈ మేరకు విప్‌ జారీ చేశామని తెలిపారు. సరైన కారణం చూపకుండా గైర్హాజరయ్యేవారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 
 
మరోవైపు, తనకు మద్దతుగా 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వెల్లడించి, బీజేపీలోకి ఫిరాయిస్తున్నట్టు గత రెండు రోజులుగా సంకేతాలు పంపిన రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు నేత సచిన్ పైలట్, అనూహ్యంగా తన మనసును మార్చుకున్నారు. 
 
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మరికాసేపట్లో ఎమ్మెల్యేలతో సమావేశాన్ని నిర్వహించనుండగా, తొలుత ఈ సమావేశానికి రాబోనని చెప్పిన ఆయన, తాజాగా, తానేమీ బీజేపీలో చేరబోవడం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి జైపూరులో నేడు సీఎం, ఎమ్మెల్యేల సమావేశం జరిగే సమయానికి, సచిన్ పైలట్ న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కావాల్సివుంది. అయితే, కొద్దిసేపటిక్రితం ఎన్డీటీవీతో మాట్లాడిన ఆయన, పార్టీని వీడబోవడం లేదని వెల్లడించారు.
 
కాగా, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న బీజేపీ అధిష్ఠానం వేచి చూసే ధోరణిని కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాజస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని, తామేమీ కాంగ్రెస్‌ను చీల్చాలని భావించడం లేదని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు