ఆ కోతిని కనిపెట్టి ఇచ్చేవాళ్లకు రూ.50వేల రివార్డు.. అక్టోబర్‌ 7కి కేసు వాయిదా

శనివారం, 26 సెప్టెంబరు 2020 (21:07 IST)
కోతిని కనిపెట్టి ఇచ్చేవాళ్లకు రూ.50వేల రివార్డు ప్రకటించారు. ఈ ప్రకటన విని అందరూ షాకయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే? చండీగఢ్‌కు చెందిన పచ్చబొట్టు ఆర్టిస్ట్‌ కమల్‌జీత్‌ సింగ్‌, ఆయన మేనేజర్‌ దీపక్‌ ఓహ్రా ఓ కోతిని పెంచుకునే వాళ్లు. అయితే వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అటవీ జంతువులను అక్రమంగా పెంచుకోవడం నేరం. దీంతో వారిద్దరినీ గత ఆగస్టు 19 పోలీసులు అరెస్టు చేశారు. 
 
అయితే ఆ తర్వాత రోజే బెయిల్‌పై విడుదలయ్యారు. కోతిని పెంచుకోవడం వాస్తవమేనని అయితే అది చట్ట రీత్యా నేరమని తెలిసిన తర్వాత అడవిలో విడిచి పెట్టేశామని పోలీసులకు విచారణ సమయంలో చెప్పారు. అయితే వారు చెప్పేది నమ్మశక్యంగా లేదని 'పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌ (పీఈటీఏ) అనే స్వచ్ఛంద సంస్థ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ లవ్‌జీందర్‌ కౌర్‌ సరైన ఆధారలతో నిరూపించాలని నిందితులకు సూచిస్తూ కేసును అక్టోబర్‌ 7కి వాయిదా వేశారు.
 
మరోవైపు విచారణ సమయంలో నిందితుల మాటల్లో స్పష్టత కొరవడిందని అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్‌ అబ్దుల్‌ ఖయ్యూం అభిప్రాయం వ్యక్తం చేశారు. కోతిని అడవిలో విడిచిపెట్టినట్లు వారు కచ్చితమైన ఆధారాలేవీ సమర్పించలేకపోయారన్నారు. అంతేకుండా కోతి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

అయితే ఫిర్యాదు చేసిన ఎన్జీవో సంస్థ కూడా ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి.. దాని ఆచూకీ తెలిపిన వారికి రూ. 50 వేల నజరానా ప్రకటించింది. తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పింది. ఈ ఘటన జరిగి నాలుగు రోజులైనా ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వార్తపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు