శబరిమలపై మహిళలొద్దు.. భారీగా మహిళా ర్యాలీ.. సుప్రీంలో రివ్యూ పిటిషన్

మంగళవారం, 9 అక్టోబరు 2018 (12:07 IST)
కేరళలోని సుప్రసిద్ధ శబరిమల అయ్యప్పస్వామి ఆలయలోకి అన్నీ వయస్కులైన మహిళలకు ప్రవేశం కల్పిస్తూ..  సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై మహిళా భక్తులే వ్యతిరేకిస్తున్నారు. సేవ్ శబరిమల పేరుతో కేరళతో పాటు దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శబరిమలలో మహిళల ప్రవేశం పురాతన కాలం నుంచి నిషిద్ధమని.. అలాంటి ఆచారం, నమ్మకాన్ని సుప్రీం కోర్టు తీర్పుతో వమ్ము చేయొద్దని భారీ సంఖ్యలో మహిళలు ర్యాలీలు, ఆందోళనలను చేపట్టారు.
 
కేరళలోని మహిళలే ఈ తీర్పును వ్యతిరేకిస్తున్నారు. తీర్పు ఇచ్చినా శబరిమలకు తాము వెళ్ళేది లేదని స్పష్టం చేశారు. కొన్ని వేలమంది మహిళలు జట్టుగా ర్యాలీగా, ''సేవ్ శబరిమల'' అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. ఇంకా ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్లు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.
 
అయితే కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ గతంలో ఇచ్చిన తీర్పుపై ''స్టే'' ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. రెండు సంస్థలు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పది నుంచి 50 ఏళ్ల వయస్సు గల మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేయాల్సిందిగా నేషనల్ అయ్యప్ప డివోటీస్ అసోసియేషన్, నాయర్ సర్వీస్ సొసైటీలు రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి.
 
దీనిపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇప్పటికిప్పుడు అత్యవసర విచారణ జరపలేమని సీజేఐ తెలిపారు. తదుపరి విచారణను అక్టోబర్ 12కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం తెలిపింది.
 
కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతిస్తూ గత నెల 28న నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై మేధావులు, ఉన్నత విద్యావంతులు, స్వచ్ఛంద సంస్థలు హర్షం వ్యక్తం చేస్తుండగా.. సాంప్రదాయవాదులు మండిపడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు