భారీ వర్షాలకు ముంబై అస్తవ్యస్తం - 22 మంది మృతి

ఆదివారం, 18 జులై 2021 (18:06 IST)
దేశ వాణిజ్య రాజధాని ముంబై అస్తవ్యస్తంగా మారింది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. 
 
ఇదిలావుంటే, ముంబైలో వర్షాలు వరదల వల్ల వేర్వేరు ప్రమాదాల్లో 22 మంది మరణించారు. విపరీతంగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రైల్వే ట్రాక్స్‌పై నీరు నిలిచిపోవడంతో పలు లోకల్ ట్రైన్స్ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 
 
ఎవరార్డ్ నగర్, హనుమాన్ నగర్, పనవేల్, వాసీ, మాన్ ఖూర్, జీటీపీ నగర్, గాంధీ మార్కెట్ ఏరియాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. గురుకృపా, ఈస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవేపై భారీగా నీరు నిలిచిపోయింది. షణ్ముక్ నంద హాల్ రోడ్డు నీట మునిగింది. సియాన్ రైల్వే స్టేషన్‌లో వరద నీరు ట్రాక్ మీదకు చేరింది.
 
లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వరద నీరు రహదారులపై నిలవడంతో హైవేలపై పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. బోరివాలి ఈస్ట్ ఏరియా ప్రాంతంలో వరదలకు కార్లు కొట్టుకుపోయాయి.
 
మరోవైపు తెల్లవారుజామున 1 గంటల సమయంలో మహుల్‌లోని భరత్‌నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి కొండపై ఉన్న కొన్ని ఇళ్లపై కాంపౌండ్ గోడ కూలి 15 మంది మరణించారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ముంబైలో భారీ వర్షాలకు ఇప్పటివరకు 22 మంది చనిపోయారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు