కేరళ సర్కారును కూల్చివేస్తాం : అమిత్ షా వెల్లడి

ఆదివారం, 28 అక్టోబరు 2018 (09:04 IST)
అయ్యప్ప భక్తుల అరెస్టులపర్వం ఆపకపోతే కేరళ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హెచ్చరించారు. శబరిమలపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలన్న కేరళ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన అయ్యప్ప భక్తులను కేరళ సర్కారు అరెస్టు చేస్తోంది. ఈ అరెస్టులపై బీజేపీ స్పందించింది. ఈ అరెస్టులు ఇలాగే కొనసాగిన పక్షంలో మేం(బీజేపీ) ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అని అమిత్ షా ప్రకటించారు. 
 
కేరళలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోర్టు తీర్పును అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్న సీఎం విజయన్‌ నిప్పుతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆరెస్సెస్‌, బీజేపీ, ఇతర సంఘాలకు చెందిన 2వేల మందికి పైగా భక్తులను రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిందని షా ఆరోపించారు. 
 
ఇతర అయ్యప్ప ఆలయాల్లో ఎక్కడా మహిళల ప్రవేశంపై ఆంక్షలు లేవని గుర్తుచేసిన షా... శబరిమల ఆలయ విశిష్టతను కాపాడాలని డిమాండ్‌ చేశారు. హిందూత్వంలో మహిళల పట్ల వివక్ష ఉండదన్నారు. కొన్ని ఆలయాల్లో మహిళలకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారని, పురుషులను రానివ్వరని.. అంతమాత్రాన అది వివక్ష చూపినట్లు కాదని ఆయన గుర్తుచేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు