హస్తిన నుంచి ఆదేశాలిస్తే సరిపోదు.. నిర్ణయం మాదే : కేంద్రానికి మమత చురకలు

గురువారం, 3 సెప్టెంబరు 2020 (10:54 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోమారు కేంద్ర వైఖరిని తూర్పారబట్టింది. హస్తినలో కూర్చొని ఆదేశాలిస్తే సరిపోదంటూ దెప్పిపొడచింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని, వాటిని అమలుచేసే బాధ్యత రాష్ట్రాలదే అని తెగేసి చెప్పింది. 
 
కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో తమ అనుమతి లేకుండా లాక్డౌన్ విధించడానికి వీల్లేదంటూ కేంద్రం ఇటీవల ఆదేశించింది. వీటిపై మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. కేవలం నిర్ణయాలను వెల్లడిస్తే సరిపోదని కేంద్రానికి చురకలంటించారు. 
 
నిర్ణయాలను అమలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉందని, రాష్ట్రాలను విశ్వసనీయతలోకి తీసుకోవాలని ఆమె సూచించారు. సెప్టెంబర్ 7, 11, 12 తేదీల్లో లాక్డౌన్ ఉంటుందని ఇప్పటికే తాము ప్రకటించామని, ఈ నిర్ణయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి కూడా తీసుకెళ్లామని ఆమె స్పష్టంచేశారు. బెంగాల్‌లో లాక్డౌన్ ఉంటుందని, ఈ సమాచారాన్ని హోంశాఖకు కూడా చేర వేశామని ఆమె స్పష్టంచేశారు.
 
'ఆదేశాలను జారీ చేయగానే సరిపోదు. నిర్ణయాలను అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై నమ్మకం ఉండాలి' అని మమతా పేర్కొన్నారు. స్థానిక పరిస్థితులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలకే ఎక్కువ అవగాహన ఉంటుందని, ఏఏ ప్రాంతాల్లో లాక్డౌన్ విధించాలన్నది వారికే ఎక్కువగా తెలుసన్నారు. 
 
అంతేకాకుండా, దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న తరుణంలో కేంద్రం ఇవేమీ పట్టించుకోకుండా జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఇలా నిర్వహించడం వల్ల తమ రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల్లో 75 శాతం మంది ఈ పరీక్షలకు హాజరుకాలేక పోయారని, వీరికి ఎవరు న్యాయం చేస్తారని మమతా బెనర్జీ ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు