ఓటు బ్యాంకు రాజకీయాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. రాజకీయ పార్టీల్లో కలకలం

సోమవారం, 2 జనవరి 2017 (12:23 IST)
ఓటు బ్యాంకు రాజకీయాల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో రాజకీయ పార్టీల్లో కలకలం రేపింది. కుల, మతాల పేరుతో విభజన రాజకీయాలు చేయవద్దంటూ రాజకీయ నేతలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ రాజకీయ నేత కానీ కులం పేరుతో, మతం పేరుతో ఓట్లను అడగరాదంటూ హెచ్చరించింది. 
 
కులాలను, మతాలను దుర్వినియోగం చేయడం కూడా అవినీతి కిందకే వస్తుందని తెలిపింది. హిందుత్వ కేసులో దాఖలైన వివిధ పిటిషన్లను ఏడుగురు న్యాయమూర్తులతో కూడా రాజ్యాంగ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. భారతదేశంలో ఎన్నికల విధానం స్వేచ్ఛాయుతమైందని, వారికి నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునే హక్కు ప్రజలకుందని కోర్టు తెలిపింది. 
 
అలాంటప్పుడు తన మతం వారికో, కులం వారికో వేయమని అడగడం సమంజసం కాదని రాజకీయ పార్టీలకు సుప్రీం సూచించింది. ప్రజల మతపరమైన విషయాలతో రాజకీయాలను ముడిపెట్టొద్దని తెలిపింది. మతం అనేది భగవంతుడికి, మనిషికి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధమని.. ఇందులో ఎవరూ జోక్యం చేసుకోరాదని తేల్చి చెప్పింది. ఇందులో ప్రభుత్వాల ప్రమేయం ఎంతమాత్రం ఉండరాదని తెలిపింది. రెండు దశాబ్దాల క్రితం ఇచ్చిన 'హిందుత్వ' తీర్పును నేడు సుప్రీంకోర్టు పున:సమీక్షించి, సవివరంగా తీర్పును వెలువరించింది. 

వెబ్దునియా పై చదవండి