సర్జికల్ స్ట్రైక్స్ వీడియో ఫుటేజీలను విడుదల చేనున్న బీజేపీ సర్కారు

బుధవారం, 5 అక్టోబరు 2016 (14:58 IST)
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద తండాలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ చుట్టూత ఇండోపాక్ రాజకీయాలు తిరుగుతున్నాయి. ముఖ్యంగా.. ఇలాంటి దాడులు జరగలేదని పాకిస్థాన్ వాదిస్తుంటే... భారత్ మాత్రం దాడులు జరిగింది నిజమేనని బల్లగుద్ది వాదిస్తోంది. 
 
అయితే, సర్జికల్ దాడులు చేసి పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పామని బీజేపీ చెబుతున్న మాటలు అవాస్తవమని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ దాడులు నిజమైతే అందుకు సంబంధించిన వీడియో ఫుటేజిలను బయటపెట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డిమాండ్ చేయగా, దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా వత్తాసు పలుకుతోంది. 
 
దీంతో సచ్ఛీలతను నిరూపించుకునేందుకు బీజేపీ ముందడుగు వేయక తప్పని పరిస్థితి నెలకొంది. తాజాగా భారత ఆర్మీ ఉన్నతాధికారులు కూడా దాడులకు సంబంధించిన వీడియోను బహిర్గతం చేసేందుకు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ప్రధానమంత్రి కార్యాలయమే ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 
 
ఇదేఅంశంపై భారత ఆర్మీ ఉన్నతాధికారులు స్పందిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో సర్జికల్ స్ట్రైక్ జరగలేదని చెబుతున్న పాక్ మీడియా నోరు మూయించాలంటే వీడియోను విడుదల చేయక తప్పదన్నారు. సర్జికల్ దాడులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు తమ వద్ద ఉన్నాయని వారు ప్రకటించారు. ఇక ఈ వీడియో ఫుటేజి అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందనే తుది నిర్ణయంగా భావించవచ్చని వారు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి