భర్తపై ప్రతీకారం కోసం... కుమార్తెను వాడుకున్న భార్య... కథ అడ్డం తిరిగి....

గురువారం, 22 ఆగస్టు 2019 (17:30 IST)
భర్తపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ భార్య తన కుమార్తెను వాడుకుంది. కుమార్తెపై కట్టుకున్న భర్త అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేసింది. ఆ తర్వాత కుమార్తెతో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయించింది. దీంతో పోలీసులు ఆ వ్యక్తిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, కథ అడ్డం తిరగడంతో చివరకు భార్యపైనే అదే ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలంటూ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు మద్రాసు హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నై నగరానికి చెందిన 11 ఏళ్ల బాలికపై కన్నతండ్రే అఘాయిత్యానికి పాల్పడ్డాడని, దీంతో ఆమె గర్భం దాల్చిందంటూ ఓ తల్లి ఇటీవల నగరంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమె భర్తపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారు.
 
ఆ తర్వాత ఈ కేసును కొట్టివేయాలంటూ బాధితుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేశ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సరిగ్గా ఇదే సమయంలో కేసు కీలక మలుపు తిరిగింది. బాధితురాలిగా పేర్కొన్న బాలిక తన తల్లి చేసినవి తప్పుడు ఆరోపణలని వెల్లడించడంతో కేసు అడ్డం తిరిగింది. ఈ విషయాన్ని ఆ బాలిక ఎగ్మూరులోని ఫ్యామిలీ కోర్టులో వెల్లడించిందని స్వయంగా న్యాయమూర్తే పేర్కొన్నారు. 
 
భర్తపై కక్ష సాధింపు కోసమే ఆ బాలిక తల్లి భర్తపై తప్పుడు ఫిర్యాదు ఇచ్చిందని ఆయన తెలిపారు. తండ్రే కుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడనే ఈ వ్యాజ్యం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆ బాలికను తాను పిలిపించి విచారించగా... ఫ్యామిలీ కోర్టులో చెప్పిన విషయాన్నే తనకూ తెలిపిందని, అది తన మనసును కలచివేసిందని.. వెల్లడించారు. 
 
భర్తపై కక్ష సాధించడం కోసం కన్న కుమార్తెపై దారుణమైన ఆరోపణ చేయడానికి ఓ తల్లికి ఎలా మనసు వచ్చిందో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. పిటిషనరుపై పోక్సో కేసును తక్షణం రద్దు చేయడంతోపాటు ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసిన మహిళపై అదే చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసు శాఖను ఆదేశిస్తున్నట్టు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు