శ్రీలంకలో ఏప్రిల్‌లో తీవ్రవాదులు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. శ్రీలంక రాజధాని కొలంబోతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఈస్టర్ పండుగ రోజున మూడు చర్చిలు, మూడు ఫైవ్ స్టార్ హోటళ్లు లక్ష్యంగా బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 359 మంది చనిపోయారు. 500 మంది గాయపడ్డారు. ఈ ఘటనను ఇంకా జనం మరిచిపోలేని పరిస్థితుల్లో వుండగా.. నిఘా సంస్థలు మరో హెచ్చరికను జారీ చేశాయి.
శ్రీలంక పేలుళ్లకు సంబంధించి 106 మంది పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఎస్ ఉగ్రవాదులతో సంబంధాలున్న కొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి వద్ద జరిపిన విచారణలో అయోధ్యను లక్ష్యంగా దాడులు జరిపేందుకు కుట్ర పన్నినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే తన పార్టీకి చెందిన 18మంది ఎంపీలతో అయోధ్యలోని రామాలయాన్ని సందర్శించేందుకు ఆదివారం వెళ్లనున్నారు.
అయోధ్యలో బస్సులు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాలును లక్ష్యంగా లష్కరే తోయిబా సంస్థ దాడులకు కుట్ర పన్నినట్లు తెలిసింది. దీంతో అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. చెక్ పోస్టులు, ప్రధాన కూడళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.