జయ మృతిపై అనుమానాలు.. మారథాన్ నిర్వహించ తలపెట్టిన కానిస్టేబుల్ అరెస్ట్

సోమవారం, 20 మార్చి 2017 (09:32 IST)
తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతి పట్ల విచారణ జరపాలని డిమాండ్ చేసిన పాపానికి తేని జిల్లా కానిస్టేబుల్ అరెస్టయ్యాడు. ఈ మేరకు జయలలితకు వీరాభిమాని అయిన కానిస్టేబుల్ వేల్ మురుగన్ జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేసారు. అంతేగాకుండా మారథాన్ కూడా నిర్వహించేందుకు ప్రయత్నించారు. తేనిజిల్లా ఓట్టైపట్టి గ్రామం పోలీసుస్టేషనలో పనిచేస్తున్న వేల్‌మురుగన్ విధినిర్వహణలో విశిష్టమైన సేవలందిం చినందుకుగాను మాజీ దివంగత ముఖ్యమంత్రి జయలలిత నుంచి పలు పతకాలు, అవార్డులు పొందారు. 
 
ఇంకా జయలలితకు కష్టాలు ఎదురైనప్పుడల్లా తేని జిల్లాలో ఆమెకు మద్దతుగా వేల్‌మురుగన్ పలు ఆందోళనలు జరిపారు. ఇకపోతే జయలలిత మృతిచెందటంతో తన స్వస్థలమైన కుచ్చనూరులో ఆమెకు గుడి కట్టనున్నట్లు వేల్‌మురుగన్‌ ప్రకటించారు. ఈ వివరాలు తెలుసుకున్న పోలీసు శాఖ ఉన్నతా ధికారులు వేల్‌ మురుగన్‌పై శాఖాపరమైన విచారణ జరిపి ఇటీవల ఆయనను సస్పెండ్‌ చేశారు.
 
ఈ పరిస్థితుల్లో జయలలిత మృతి పై కొనసాగుతున్న అనుమానాలను నివృత్తి చేయడానికి గాను న్యాయవిచారణ కోరుతూ ఆదివారం ఉదయం గూడలూరులోని బెన్నీకుక్‌ స్మారకమండపం నుంచి చెన్నై నగరం వరకు మారథాన్ జరిపేందుకు వేల్‌మురుగన్‌ ప్రయత్నించారు. కానీ అంతలోపే ఆయనను అరెస్ట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి