ఆ కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాల్సిందే: హైకోర్టు సంచలన తీర్పు

బుధవారం, 12 మే 2021 (21:01 IST)
ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల వల్లే కరోనా పెరిగిందన్న విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఎంతో మంది సిబ్బంది కోవిడ్ బారినపడిన మరణించారు. ఈ క్రమంలో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. యూపీ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొని మరణించిన సిబ్బందికి రూ. కోటి తగ్గకుండా ఎక్స్​గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇటీవల ఉత్తరప్రదేశ్​ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొన్న 135 మంది సిబ్బంది కరోనా బారీన పడి మరణించారు. అయితే, మరణించిన వారి కుటుంబాలకు రూ. 30 లక్షలు పరిహారం ఇవ్వాలని ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వం నిర్ణయించింది. అది సరిపోదని కనీసం రూ.కోటి పరిహారం ఇవ్వాలని అలహాబాద్​ కోర్టు సంచలన తీర్పు వెలువరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
 
"ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు సిబ్బంది స్వచ్చందంగా ముందుకు రాలేదు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లో వారికి ఇష్టం లేకున్నా సరే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం విధులు నిర్వర్తించారు. ఈ కారణంగా కొంత మంది సిబ్బంది కరోనా బారిన పడి మరణించారు. ఈ మరణాలకు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్​ బాధ్యత వహించాలి. ఎందుకంటే, కరోనా నేపథ్యంలో చాలా మంది ఎన్నికల విధులను నిర్వర్తించడానికి అయిష్టతను చూపించినప్పటికీ ప్రభుత్వం వారిని బలవంతంగా విధులకు హాజరయ్యేలా చేసింది.'' అంటూ జస్టిస్ సిద్ధార్థ వర్మ, అజిత్ కుమార్ డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది.
 
''కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే, ఆ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారుతుంది. వారి జీవితాలను తిరిగి తీసుకురాలేం. కనీసం ఆర్థికంగా వారికి అండగా నిలిచేందుకు ఎక్కువ మొత్తంలో నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అంతేకాదు, కరోనా తీవ్రత ఉన్నప్పటికీ కనీస చర్యలు తీసుకోకుండా ఎన్నికలు నిర్వహించడం అనేది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్​ తప్పిదం. దీన్ని ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా భావిస్తున్నాం.' అని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించింది.

సిబ్బందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించేందుకు తగినన్ని RTPCR కిట్లు కూడా లేనప్పుడు.. వారిని విధులు నిర్వర్తించమని ఎలా బలవంతం చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ఎన్నికల కమిషన్​ను ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఈ ముప్పు గురించి ముందే తెలుసని, అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వారి ఉదాసీన వైఖరికి నిదర్శనమని స్పష్టంచేసింది. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఉపాధ్యాయులు, ఇతర ఎన్నికల సిబ్బంది రిస్క్ తీసుకోవలసి వచ్చిందని అభిప్రాయపడింది.
 
విధుల్లో ఉన్న సిబ్బంది కరోనా బారిన పడకుండా కాపాడేందుకు అటు పోలీసు శాఖ, ఇటు ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అందువల్ల, ప్రస్తుతం ప్రకటించిన రూ. 30 లక్షల పరిహారంపై ప్రభుత్వం పునరాలోన చేస్తుందని ఆశిస్తున్నాం.' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, ఉత్తరప్రదేశ్​ పంచాయితీ ఎన్నికల్లో పాల్గొన్న 135 మంది సిబ్బంది కరోనా బారీన పడి గత నెలలో మరణించారు. ఈ మరణాలను బట్టి చూస్తే ఎన్నికల సిబ్బందిని కరనా బారి నుంచి రక్షించడానికి పోలీసులు లేదా ఎన్నికల సంఘం కనీస చర్యలు తీసుకోలేదని స్పష్టమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు