దేశంలో పెద్ద ఎత్తున విమాన మరమ్మతులను చేపట్టేందుకు వీలుగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నూతన విధానాన్ని ఆవిష్కరించినట్లు రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలో విమానాల మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్ హాలింగ్ (ఎంఆర్వో) సేవలు అరకొరగా మాత్రమే ఉండటానికి కారణాలను ఆయన వివరించారు.
ఎంఆర్వో సేవలపై వసూలు చేసే అత్యధిక జీఎస్టీ, దేశంలో అంతర్జాతీయ ఆమోదం పొందిన మెయింటెన్స్ సౌకర్యాలు లేమి, విమానాలు లీజు అగ్రిమెంట్లలో ఉండే నిబంధనలు వంటి కారణాల వలన దేశంలో ఎంఆర్వో సేవలు విస్తృతికి అవరోధంగా నిలిచాయని ఆయన చెప్పారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గత ఏడాది ఏప్రిల్ నుంచి ఎంఆర్వో సేవలపై విధిస్తున్నజీఎస్టీని హేతుబద్దం చేయడం జరిగింది. ఏఏఐ ప్రవేశపెట్టిన నూతన ఎంఆర్వో విధానంతో రెండేళ్ళ ఈ రంగం పుంజుకుంటుందని ఆయన చెప్పారు.
దేశంలో పౌర, సైనిక విమానాల మరమ్మతుల కోసం ఎంఆర్వో సేవలను ప్రవేశపెట్టేందుకు హెచ్ఏఎల్-ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ సంయుక్తంగా పని చేయబోతున్నాయి. ఈ మేరకు వాటి మధ్య గత ఫిబ్రవరిలో ఎంవోయూ కుదిరినట్లు మంత్రి తెలిపారు.
అలాగే దేశంలో ఎంఆర్వో సేవలను విస్తృతపరిచేందుకు ఎయిర్‌బస్, బోయింగ్ సంయుక్తంగా జిఎంఆర్, ఎయిర్ వర్క్స్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాయని చెప్పారు.