యువతను పక్కదోవ పట్టిస్తున్న నక్సలిజం : ప్రధాని నరేంద్ర మోడీ

శుక్రవారం, 28 అక్టోబరు 2022 (16:59 IST)
దేశంలోని యువతను నక్సలిజం పక్కదోవ పట్టిస్తుందని, అందువల్ల దాని అంతు చూడాల్సిందేనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశ వ్యాప్తంగా పోలీసులకు ఒకే రకమైన యూనిఫాం ఉంటే బాగుంటుందని ఆయన సూచించారు. అదేసమయంలో  సోషల్ మీడియాను తక్కువ అంచనా వేయొద్దని ఆయన పిలుపునిచ్చారు. 
 
ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ సారథ్యంలో అన్ని రాష్ట్రాల హోం మంత్రులు, డీజీపీలతో జరిగిన చింతన్ శిబిరం (మేధోమథన సదస్సు)లో భాగంగా శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. యువత భావోద్వేగాలను వాడుకుని దేశ సమైక్యతను దెబ్బతీసేందుకు యత్నించేవారిని ఓడించేందుకు మన బలగాలు మేధోశక్తిని పెంచుకోవాలని కోరారు. 
 
పోలీస్ స్టేషన్లను బహుళ అంతస్తుల్లో నిర్మించాలని, దేశ వ్యాప్తంగా పోలీసులకు ఒకే రకమైన యూనిఫాం ఉంటే బాగుంటుందని మోదీ అన్నారు. దేశ వ్యాప్తంగా పోస్ట్ బాక్స్‌ను ఎలా గుర్తు పట్టగలమో అదే విధంగా పోలీస్ యూనిఫాంను కూడా గుర్తించగలిగేలా ఉండాలన్నారు. 
 
సోషల్ మీడియాను తక్కువ అంచనా వేయొద్దన్నారు. తప్పుడు వార్తలతో ప్రజలను గందరగోళానికి గురిచేసే శక్తి సోషల్ మీడియాకు ఉందని చెప్పారు. ఏదైనా సమాచారాన్ని ఫార్వర్డ్ చేసే ముందు పదిసార్లు చెక్ చేసుకోవాలని ప్రధాని మోడి విజ్ఞప్తి చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు