జయలలిత కొత్త కూతురు వెనుక ఉన్నవారు ఎవరో... కేతిరెడ్డి
ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (21:11 IST)
jaya
తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణించిన అనంతరం జరుగుతున్న పరిణామాలపై తమిళనాడు ప్రజలు, జయలలిత అభిమానులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, తెలుగు భాషా పరిరక్షణ వేదిక కన్వీనర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జయలలిత వారసులమంటూ కొత్తగా పుట్టుకొస్తున్నవారి ప్రకటనలు చూస్తుంటే అనుమాలున్నాయన్నారు.
జయ వారసులుగా రోజుకు ఒకరు తెరపైకి వస్తున్నారు. వారందరూ కేవలం జయలలిత, శోభన్ బాబుల సంతానం అని చెబుతున్నారు. శోభన్ బాబు డీఎన్‌ఏతో తమ డీఎన్‌ఏను ఎందుకు సరిపోల్చమని అడగడం లేదని పేర్కొన్నారు. జయలలిత వారసత్వం మాత్రమే వీరందరూ కోరుతున్నారన్నారు. శోభన్ బాబుకు కూడా వీరు వారసులైనప్పటికీ ఆయన ఆస్తులను ఎందుకు వీరు కోరడం లేదని జగదీశ్వర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.
ఇప్పుడు జయ కొత్త కూతురుగా బెంగళూరు నుంచి వచ్చిన అమృత అనే యువతి వెనక ఉన్న అదృశ్య వ్యక్తులు ఎవరో అని ప్రజలకు తెలియాలన్నారు. గతంలో అధికారం కోసం 2012లో జయలలితపై విష ప్రయోగానికి ప్రయత్నించిన శశికళ బెంగళూరు జైలు నుంచి సృష్టించిన ఒక కొత్త పాత్రధారి ఈ అమృత అని ఆరోపించారు. దీని వెనుకాల మన్నారుకుడి మాఫియా హస్తం ఉన్నదా అనే అనుమానాలు కూడా ఆయన వ్యక్తం చేశారు. జయలలిత ఆస్తిపాస్తులను కాపాడుకునేందుకు శశికళ లేక జయలలిత మేనకోడలు, మేనల్లుడు పన్నిన పన్నాగంలో అమృత పాత్ర ఉన్నదా అనే అనుమానాలు నిగ్గుతేలాలంటే కేంద్రం సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు.
అమృత తన మాటల్లో కొందరు వ్యక్తులు జయలలిత తన తల్లి అని చెప్పినట్టు, ఇంతకాలం తాను జయలలిత చెల్లెలు వద్ద బెంగళూరులో పెరిగినట్టు పొంతనలేని కథలు అల్లిందన్నారు. జయలలిత మరణించి దాదాపు 9 నెలలు అయినప్పటికి ఇప్పుడు వచ్చి జయలలిత కుమార్తె అని చెప్పడం, శశికళ తన తల్లి చావుకు కారణం అని రాష్ట్రపతికి, ప్రధానికి సీబీఐ దర్యాప్తు కావాలని కోరుతూ లేఖలు రాయడం వాస్తవ విరుద్ధంగా ఉన్నాయన్నారు.
తాను డీఎన్‌ఏ పరీక్షలకు సిద్ధమని తెలియజేయడం వెనక కూడా కుట్ర దాగి ఉందని కేతిరెడ్డి అన్నారు. ఇప్పటికే అమృత డీఎన్‌ఏ శాంపిల్స్ తీసి, జయలలిత శాంపిల్స్‌గా సృష్టించారేమో అన్న అనుమానం కలుగుతోందన్నారు. జయలలిత ఆసుపత్రిలో ఉండగా జరిగిన ఒక ఉప ఎన్నిక కొరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా జయలలిత సంతకం చేయలేని పరిస్థితిలో ఉండగా, అదే సమయంలో వేరే వ్యక్తి వేలిముద్రలను జయలలిత వేలి ముద్రలుగా శశికళ సృష్టించారనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయన్నారు.
జయలలిత ఆస్తులను తన సొంతం చేసుకోవడానికే శశికళ ఒక పన్నాగం పన్నిందని తమిళనాడు ప్రజలు, జయలలిత అభిమానుల్లో అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీ తమిళనాడులో పాగా వేయడం కోసం అక్కడి అవినీతి ప్రభుత్వంపై కేంద్రపెత్తానం ఉండాలని అడుగులు వేస్తోందేగానీ, జయలలిత మరణం వెనక దాగున్న కుట్ర కోణాన్ని మాత్రం పట్టించుకోవడంలేదు. జయలలిత బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. తనకు వారసులు లేరు కాబట్టి జయ కోరిక ప్రకారం ఆమె ఆస్తులు అన్ని ప్రజలకే చెందాలన్నారు. ఆ దిశగా కేంద్రం సీబీఐతో విచారణ చేపట్టి.. ఎవరు దోషులో తేల్చిన రోజే తమిళనాడు ప్రజల గుండెల్లో బీజేపీకి ఒక సుస్థిరమైన స్థానం ఉంటుందని కేతిరెడ్డి తెలిపారు.
జయలలిత మరణం వెనుక అనుమానులున్నాయని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సుప్రీం కోర్టులో గతంలో సీబీఐ దర్యాప్తు కోరుతూ కేసును దాఖలు చేశారు. ఆ కేసులో విచారణలో కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే సదరు కేసు దాఖలు చేయవల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం కోరి, ఆ కేసును కొట్టివేసింది. ఇప్పడు అమృత తానే జయలలిత కుమర్తెనని చెప్పుకోంటోంది కాబట్టి, రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను పక్కన పెట్టి సుప్రీం కోర్టులో వ్యాజ్యం వేస్తే అందుకు తన వంతుగా పూర్తి సహాకారం అందిస్తానని కేతిరెడ్డి తెలిపారు.