గోరఖ్‌పూర్‌లో భాజపాను చావుదెబ్బ కొట్టింది ఎవరో తెలుసా?

బుధవారం, 14 మార్చి 2018 (18:47 IST)
ముప్పయ్యేళ్ల చరిత్ర మంచులా కరిగిపోయింది. ఒక్క దెబ్బతే భాజపా దిమ్మ తిరిగిపోయింది. వరుస విజయాలతో దూసుకెళుతున్న భాజపాకు ఒక్కసారిగా అన్నిచోట్లా షాక్ తగిలి గిలగిలలాడుతోంది. ఇకపోతే గోరఖ్‌పూర్ నియోజకవర్గంలో భాజపా ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుతుందని అనుకున్నారు. కానీ బోల్తా కొట్టింది. 
 
ఎస్పీ, బీఎస్పీల రాజకీయ వ్యూహం ముందు భాజపా పూర్తిగా చిత్తుచిత్తుగా ఓడింది. ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిషద్ 21,961 మెజారిటీతో బీజేపీపై ఘన విజయం సాధించి భాజపా చరిత్రకు బ్రేకులు వేశారు. భాజపా పరాజయానికి ప్రధానంగా నిషద్‌లు, మల్లాల ఓట్లేనని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. గోరఖ్‌పూర్‌లో మొత్తం 19.5 లక్షలకు పైగా ఓటర్లున్నారు. వీరిలో 4.5 లక్షల వరకు నిషద్‌లు, మల్లాల ఓట్లే వున్నట్లు తెలుస్తోంది.
 
గోరఖ్‌పూర్‌ ఓటర్లలో ఈ రెండువర్గాల వారి ఓట్ల శాతం 23 శాతంగా వుండటంతో మిగిలిన మైనారటీ వర్గాలైన ముస్లింలు, దళితుల ఓట్లన్నీ చీలిపోకుండా ఎస్పీ, బీఎస్పీ పక్కా ప్రణాళిక వేయడంతో భాజపా చిత్తయింది. అంతేమరి... విజయం వచ్చినప్పుడు జాగ్రత్తగా మూలాల్లోకి వెళ్లి పరిశీలన చేయకపోతే పరిస్థితి ఇలాగే వుంటుంది మరి. మొత్తమ్మీద వచ్చే 2019 ఎన్నికలకు ముందే భాజపాకు గుండెల్లో రైళ్లు పరుగెట్టేట్లు చేశాయి ఈ ఫలితాలు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు