మోడీ తోలు తీస్తామంటున్న లాలూ పుత్రుడు.. ఎందుకు?

మంగళవారం, 28 నవంబరు 2017 (08:44 IST)
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌‌ తనయుడు తేజ్ ప్రతాప్‌ యాదవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన తండ్రికి కొనసాగుతున్న నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ (ఎన్‌ఎస్‌జీ) భద్రతను కేంద్రం ఉపసంహరించింది. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
ప్రస్తుతం జెడ్‌‌ప్లస్‌ కేటగిరీ భద్రత కలిగి ఉన్న ఆయనకు ఎన్‌ఎస్‌జీ కమెండోలు గార్డులుగా రక్షణగా ఉంటూ వచ్చారు. దీనిని జెడ్‌ కేటగిరికి కుదించింది. పలువురు ప్రముఖులకు ప్రస్తుతం అందజేస్తున్న భద్రతా సదుపాయాలపై కేంద్ర హోంశాఖ ఇటీవలే సమీక్షించి ఈ నిర్ణయం తీసుకుంది.
 
తన తండ్రికి జడ్‌‌ప్లస్‌ భద్రతను తొలగించడంపై తేజస్వీ మండిపడ్డారు. లాలూను హత్య చేయించడానికి జరుగుతున్న కుట్ర అని ఆరోపించారు. ఇందుకు సరైన జవాబు చెబుతామని, తన తండ్రికి ఏమైనా జరిగితే నరేంద్ర మోడీ చర్మం తీయిస్తాననంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి గొంతు నులిమేస్తున్నారని తేజ్ ఆరోపించారు. ఇందులో భాగంగానే తన తండ్రి హత్యకు కుట్ర పన్నుతున్నారనీ, ఆయన హత్యకు గురైతే మీడియా బాధ్యత వహిస్తుందా? అని ఓ ప్రశ్నకు బదులుగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి ప్రాణం విలువైనది కాదా? అని ఎదురు ప్రశ్నించారు.
 
దీనిపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ స్పందించారు. లాలూకు ఏమైనా జరిగితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది బాధ్యత అనడం సరికాదన్నారు. ఇందిరాగాంధీ గట్టి భద్రత నడుమ కుప్పకూలిపోయారు. దీనికి ఎవరిది బాధ్యత? అని సుశీల్‌ కుమార్‌ ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు