భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము విజయం సాధించారు. ఈ నెల 18వ తేదీన జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటల నుంచి చేపట్టారు. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత తుది ఫలితాలను ప్రకటించారు. ఇక్కడ విచిత్రమేమిటంటే.. ఈ ఓట్ల లెక్కింపు పూర్తికాకుండానే ఆమె సమీప ప్రత్యర్థి, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తన ఓటమిని అంగీకరించారు.
గురువారం రాత్రి 9 గంటల సమయంలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అధికార పక్షానికి పూర్తి స్థాయిలో మెజారిటీ ఉందని తెలిసి కూడా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన యశ్వంత్ సిన్హా ఓటు హక్కు కలిగిన ప్రజా ప్రతినిధులు ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని విజ్ఞప్తి చేసిన విషయం తెల్సిందే.