అమెరికా ప్రవాసుల్లోనూ "సమైక్యాంధ్ర నినాదం"

FILE
సమైక్యాంధ్ర ఉద్యమ నినాదం అమెరికాలోని ప్రవాస భారతీయుల్లోకి చొచ్చుకెళ్లింది. సమైక్యాంధ్రకు మద్ధతుగా కాలిఫోర్నియా, టెక్సాస్ రాష్ట్రాలలోని తెలుగువారు పలు కార్యక్రమాలను నిర్వహించి, "సమైక్యాంధ్రే ప్రగతికి సంకేతం" అంటూ ఎలుగెత్తి నినదించారు. కొంతమంది స్వార్థపూరిత రాజకీయ నాయకుల కారణంగా రాష్ట్రం ముక్కలయ్యే పరిస్థితి తలెత్తటం దురదృష్టకరమని ఎన్నారైలు ఈ సందర్భంగా విమర్శించారు.

సమైక్యాంధ్రను సమర్థిస్తూ డల్లాస్‌లోని కోకిల రెస్టారెంట్‌లో ఏర్పాటైన సమావేశానికి దాదాపు 200 మంది తెలుగువారు హాజరయ్యారు. సమైక్యాంధ్రకు మద్ధతుగా భారతదేశంలోని రాజకీయ పార్టీలకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఓ ప్రత్యేక విజ్ఞాపనా పత్రాన్ని సమర్పించాలని వీరంతా నిర్ణయించారు.

అలాగే కాలిఫోర్నియాలోని మిల్పీటస్ నగరంలోని సెర్రా థియేటర్స్ ప్రాంగణంలో నిర్వహించిన మరో సమావేశంలో సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు మద్ధతుగా ఓ తీర్మానాన్ని ఆమోదించారు. సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, విడిపోవటంవల్ల లాభంకంటే నష్టమే ఎక్కువని వారు స్పష్టం చేశారు. కాగా ఈ సమావేశంలో ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు చెందిన 500 మంది ఎన్నారైలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రవాసాంధ్ర సమైక్యాంధ్ర సమితి కన్వీనర్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలుగా చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. అవసరమయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారినందరినీ సమన్వయపరచి, హైదరాబాద్‌లోనే భారీ సభను నిర్వహిస్తామని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి