ఎన్నారై వృద్ధుడి హత్యకేసులో 4గురి అరెస్ట్

భారత సంతతికి చెందిన వృద్ధుడు ఎక్రముల్ హక్ (67)పై దాడిచేసి, ఆయన మృతికి కారణమైన నలుగురు బ్రిటీష్ బాలురను ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ముందుగా 12, 14, 15 సంవత్సరాల వయస్సున్న ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు క్రయినాడ్ యూత్ కోర్టులో హాజరుపరిచారు. ఆ తరువాత 14 ఏళ్ల వయస్సున్న మరో బాలుడిని కూడా అరెస్టు చేసిన పోలీసులు అతడిని కోర్టులో హాజరు పరిచారు.

ఇదిలా ఉంటే... కోల్‌కతాకు చెందిన ఎక్రముల్ హక్ పై నలుగురు అబ్బాయిలు ఆగస్టు 31వ తేదీన ఇదారా ఇ జఫరియా మసీదువద్ద దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ హక్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ, కోలుకోలేని పరిస్థితుల్లో గత సోమవారం సాయంత్రం మరణించిన సంగతి తెలిసిందే..!

కాగా... మసీదు నుంచి తన ఐదు సంవత్సరాల మనవరాలితో తిరిగి వస్తుండగా, టూంటింగ్ ప్రాంతంలో పై నలుగురు పాఠశాల విద్యార్థులు హక్‌ను విచక్షణా రహితంగా కొట్టినట్లు పోలీసులు తెలియజేశారు. ఈ కేసును జాతి వివక్షకు సంబంధించిన హత్యగా భావించి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి