"పద్మ అవార్డు"లపై ప్రవాస భారతీయుల హర్షం..!

FILE
భారత ప్రభుత్వం తమకు ప్రకటించిన "పద్మ అవార్డు"ల పట్ల అమెరికా ప్రవాస భారతీయులు హర్షం వ్యక్తం చేశారు. తమకు దక్కిన విశిష్ట పురస్కారాలను వినయపూర్వకంగా స్వీకరిస్తామని ప్రవాస ప్రముఖులు షరీద్ జకారియా, శాంత్ సింగ్ ఛత్వాల్, సుధీర్ ఎమ్ ఫరీఖ్ తదితరులు పేర్కొన్నారు.

ప్రవాస పాత్రికేయుడు షరీద్ జకారియా ఈ మేరకు మాట్లాడుతూ.. పద్మ అవార్డుకు ఎంపిక కావటం తనకు ఎంతగానో ఆనందంగా ఉందన్నారు. గొప్ప పనులు చేసినవారితో సమానంగా తనను గౌరవించటం అన్నింటికంటే సంతోషం కలిగిస్తోందని చెప్పారు. కాగా.. న్యూస్‌వీక్ అంతర్జాతీయ సంపాదకుడిగా పనిచేస్తున్న జకారియాను "పద్మభూషణ్" అవార్డు వరించింది.

ఎన్నారై వ్యాపారవేత్త శాంత్ సింగ్ ఛత్వాల్ మాట్లాడుతూ.. తనకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన భారత ప్రభుత్వానికి రుణపడి ఉంటానని సంతోషం వ్యక్తం చేశారు. భారత్-అమెరికా సంబంధాల బలోపేతానికి చేసిన కృషికిగానూ తనకు ఈ గౌరవం దక్కిందని ఆయన వివరించారు. కాస్త ఆలస్యమైనా తనపై నమ్మకం ఉంచి ఈ గౌరవానికి ఎంపిక చేయటంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ఎన్నారై వైద్యుడు, సేవకుడు, పబ్లిషర్ సుధీర్ ఎమ్ పరీఖ్ మాట్లాడుతూ.. పద్మశ్రీ అవార్డుతో తన బాధ్యత మరింతగా పెరిగిందని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం తనకు పద్మశ్రీ అవార్డు ప్రకటించటంపట్ల ఆనందం వ్యక్తం చేసిన ఆయన, భారత్-అమెరికా సంబంధాల పటిష్టతకు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానన్నాడు.

వెబ్దునియా పై చదవండి