ప్రపంచమంతటా విలయతాండవం చేస్తున్న ఆర్థికమాంద్యం దెబ్బకు ఆస్ట్రేలియాలో ప్రతియేటా నిర్వహించే భారతీయ వివాహ వేదిక (ఇండియన్ బ్రైడల్ ఫెయిర్) సైతం కుదేలయ్యింది. సంక్షోభం కారణంగా భారత ప్రభుత్వం, కార్పొరేట్ రంగం ఈ కార్యక్రమానికి మద్ధతివ్వలేమంటూ చేతులెత్తేయడంతో ప్రధాన భాగస్వాములు వెనక్కి తగ్గారు. దీంతో వివాహ వేదిక వెలవెల బోయింది.
రెండు రోజులపాటు జరిగే ఈ ఇండియన్ బ్రైడల్ ఫెయిర్ కార్యక్రమం శనివారం మెల్‌బోర్న్‌లో ప్రారంభమయ్యింది. వివాహానికి సంబంధించిన వాటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ప్రతి సంవత్సరం ఒక్కో నగరంలో ఈ ఫెయిర్‌ను నిర్వహిస్తున్నారు. అయితే మెల్‌బోర్న్‌లో తొలిసారిగా ఏర్పాటయిన ఈ వివాహ వేదిక పెద్దసంఖ్యలో ప్రజలు, ప్రదర్శనకారుల్ని ఆకట్టుకోలేక పోయింది.
ఈ సందర్భంగా వేదిక నిర్వాహకుడు, ఇండియా ట్రేడ్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ నానా లక్ష్మణ్ మాట్లాడుతూ... భారత ప్రభుత్వం, కార్పొరేట్ రంగం ఈ ఏడాది తమకు అండగా లేవనీ, ఎప్పుడూ తమకి మద్ధతుగా నిలిచే ఎయిర్ ఇండియా సైతం సంక్షోభం కారణంగా తప్పుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్ళుగా నిర్వహిస్తున్న ఈ వేదికకు గతంలో ప్రజల్లో, ప్రదర్శనకారుల్లో పెద్ద ఎత్తున స్పందన ఉండేదనీ, ఈ సంవత్సరం ఎలాంటి స్పందనా లేదని లక్ష్మణ్ వాపోయారు.
కాగా... భారత్ వెళ్లే అవసరం లేకుండానే వివాహాలకు కావలసిన అన్నిరకాల ఉత్పత్తులను తాము ఈ వేదికలో అందుబాటులో ఉంచుతున్నామని లక్ష్మణ్ తెలియజేశారు. వచ్చే ఏడాదిలో నిర్వహించే వేదికలో జ్యోతిష్యం, హస్తాముద్రికం, సంఖ్యా శాస్త్రానికి సంబంధించిన సేవలను కూడా అందించనున్నామని లక్ష్మణ్ వివరించారు.