విచారణను వేగవంతం చేయాలని కోరా..: కృష్ణ

FILE
తమ పౌరులపై జరుగుతున్న దాడుల కేసులకు సంబంధించిన విచారణను వేగవంతం చేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కోరినట్లు కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి ఎస్ఎమ్ కృష్ణ న్యూఢిల్లీలో వెల్లడించారు. అలాగే ఈ కేసులలో కొనసాగుతున్న విచారణలు ఏ స్థాయిలో ఉన్నాయన్న విషయం గురించి కూడా ఆసీస్‌తో మాట్లాడినట్లు ఆయన వివరించారు.

ఈ విషయమై కృష్ణ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా విదేశాంగ శాఖా మంత్రితో ఫోన్ మాట్లాడాననీ, విద్యార్థులపై దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేశానని చెప్పారు. వీలైనంత త్వరగా దోషులను చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ఆసీస్ ప్రభుత్వానికి ఉందన్న విషయాన్ని కూడా గుర్తు చేసినట్లు ఆయన తెలిపారు.

తమ పౌరులపై జాతి వివక్షతోనే దాడులు జరుగుతున్నట్లు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశానని ఎస్ఎమ్ కృష్ణ మీడియాకు వివరించారు. కాగా.. ఆసీస్‌లో జరుగుతున్న దాడులన్నీ జాత్యహంకారంతో కూడుకున్నవి కావని ఇప్పటికే ఆ దేశ ప్రధాని, ఇతర మంత్రులు, అధికార ప్రతినిధులు వాదిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదలా ఉంచితే తాజాగా సిడ్నీలో మరో భారతీయ యువకుడిపై దాడి జరిగింది. ఆసీస్ యువకులు, యువతులు కలిసి బీచ్‌లో ఆ యువకుడిపై దాడికి పాల్పడి పిడిగుద్దులు, ముష్టిఘాతాలకు దిగారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

వెబ్దునియా పై చదవండి