స్వదేశానికి తరలిరానున్న కిరణ్ మృతదేహం

దక్షిణాఫ్రికాలో దుండగుల కాల్పులకు బలయిన వరంగల్ జిల్లా ఆరెపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కిరణ్ మృతదేహం నేడు స్వదేశానికి తరలిరానుంది. భారత కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 4 గంటలకు కిరణ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చొరవవల్ల దక్షిణాఫ్రికా ప్రభుత్వం కిరణ్ మృతదేహాన్ని తరలించేందుకు అనుమతించినట్లు తమకు సమాచారం అందిందని కిరణ్ కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు.

ఈ విషయమై కిరణ్ సోదరుడు గణేష్ మాట్లాడుతూ... తన సోదరుడి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఎంబసీ సభ్యుడు రమణారెడ్డి తమకు చెప్పినట్లు పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలోని భారతీయులు, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు అక్కడి న్యాయపరమైన అంశాలన్నింటినీ పూర్తి చేసి గురువారం మృతదేహాన్ని తరలించేందుకు తమ పూర్తి సహకారాన్ని అందించారని గణేష్ వివరించారు.

కిరణ్ మృతదేహాన్ని భారత్‌కు వచ్చే ఓ ప్రత్యేక విమానం ద్వారా తరలించనున్నారని గణేష్ తెలియజేశారు. ఇదిలా ఉంటే... రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరిన కిరణ్‌కు... వేరే కంపెనీ నుంచి కొత్త ఉద్యోగం కోసం ఆఫర్ రావడంతో ఇంటర్వ్యూకి వెళ్లాడు.

అయితే, ఇప్పటికే ఉద్యోగం ఉన్న నువ్వు మళ్లీ మాకెందుకు పోటీగా వచ్చావంటూ... ఒక భారతీయ యువకుడు, మరో ముగ్గురు నల్లజాతి యువకులతో కలిసి కిరణ్‌పై దాడికి పాల్పడి తుపాకీతో కాల్చివేశారు. కడుపులోకి రెండు బుల్లెట్లు దూసుకుపోవడంతో ప్రమాదకర పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న కిరణ్‌ను అతని స్నేహితులు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమించటంతో కిరణ్ మృత్యువాత పడ్డాడు.

వెబ్దునియా పై చదవండి