అమెరికాకి వచ్చే విదేశీ విద్యార్థులకు జారీ చేయబడే స్టూడెంట్ వీసా సదుపాయాన్ని కొంతమంది విద్యార్థులు, స్టూడెంట్ రిక్రూటర్లు దుర్వినియోగపరచడం బాధాకరంగా ఉందని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారి హీదర్ ఆవేదన వ్యక్తం చేసారు. కొంతమంది విదేశీ విద్యార్థులు నకిలీ వివరాలతో అమెరికాలోకి ప్రవేశించారనీ.. వారికి అమెరికాలోనే ఉంటున్న స్టూడెంట్ రిక్రూటర్లు కూడా సహాయపడ్డారని ఆమె చెప్పారు.
తాము నకిలీ యూనివర్శిటీకి దరఖాస్తు చేస్తున్న విషయం.. అరెస్టయిన ప్రతి ఒక్క విద్యార్థికీ ముందే తెలుసునని ఆమె చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ముందుగా ఏదో ఒక రకంగా స్టూడెంట్ వీసాను పొంది విద్యార్థిగా అమెరికాలోకి ప్రవేశించిన మీదట.. సీపీటీ ప్రోగ్రాం ద్వారా వర్క్ వీసాను పొందాలనే ఆలోచనతోనే వారందరూ ఈ దారుణానికి పాల్పడ్డట్లు హీదర్ పేర్కొన్నారు.
నకిలీ వివరాలతో విదేశీ విద్యార్థులను అమెరికాకు తీసుకొచ్చేందుకు కొంతమంది రిక్రూటర్లు అక్రమ ఇమ్మిగ్రేషన్‌కు పాల్పడుతూ దీన్నే పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రతి ఏడాదీ అమెరికాలో పది లక్షల మంది విదేశీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారనీ... అందులో భారతీయులు లక్షా 96 వేల మంది ఉన్నారనీ తెలిపారు.
విదేశీ విద్యార్థులు అమెరికా యూనివర్శిటీలకు, ఎకానమీకి ఎంతో విలువైనవారనీ..అంతేకాకుండా వారి ద్వారా అమెరికన్లకు వివిధ దేశాల సంస్కృతులు, సంప్రదాయాలు తెలుస్తున్నాయనీ ఆవిడ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. విదేశీ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఆవిడ హామీ ఇచ్చారు.
అయితే, పే అండ్ స్టే వీసా కుంభకోణంలో 130 మంది విదేశీ విద్యార్థులను అమెరికా ప్రభుత్వం అరెస్ట్ చేయగా... అరెస్టయిన 130 మందిలో 129 మంది భారతీయులే కావడం విచారించాల్సిన విషయం. అమెరికాలోని తెలుగు సంఘాలు ఐకమత్యంగా పనిచేస్తూ అరెస్టయిన విద్యార్థులను ఒక్కొక్కరిగా బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాయి.