టిబెట్‌కు స్వేచ్ఛ ప్రకటించండి : అథ్లెట్ల నిరసన గళం

శుక్రవారం, 8 ఆగస్టు 2008 (13:48 IST)
విశ్వ క్రీడల సంరంభానికి కాసేపటిలో తెరలేవనుండగా టిబెట్‌ రూపంలో చైనాకు కొత్త కొత్త నిరసనలు ఎదురవుతున్నాయి. ఒలింపిక్ క్రీడల నిర్వహణతో ప్రపంచాన్ని తనవైపు తిప్పుకోవాలని తపిస్తున్న చైనాకు టిబెట్ వ్యవహారం అడుగడుగునా తలనొప్పిలా మారింది.

టిబెట్‌కు స్వేచ్ఛ ప్రసాధించాలని కోరుతూ దాదాపు 40 మంది అథ్లెట్లు గురువారం తమ సంతకాలతో కూడిన ఓ లేఖను చైనా అధ్యక్షుడు హు జింటావోకు అందజేశారు. ఇలా నిరసన గళం వినిపించిన వారిలో ప్రపంచ ప్రఖ్యాత అథ్లెట్లు ఉండడం గమనార్హం.

పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో ప్రపంచ రికార్డు సాధించిన క్యూబా క్రీడాకారుడు రోబెల్స్, హైజంప్ ప్రపంచ ఛాంపియన్ బ్లాంకా వ్లాసిక్, అమెరికాకు చెందిన స్ప్రింటర్ డీడీ ట్రోటర్ లాంటి అథ్లెట్లు నిరసన గళం విప్పినవారిలో ఉన్నారు.

ఈ హఠాత్పరిమాణంతో శుక్రవారం ప్రారంభం కానున్న ఒలింపిక్ సంబరాలకు చైనా కనీవినీ ఎరుగని భద్రతా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బీజింగ్ నగరంలో సంచరిస్తున్న విదేశీయులపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక పోలీసు విభాగాన్ని రంగంలోకి దించింది.

వెబ్దునియా పై చదవండి