'అక్షయ నవమి' నేడే.. ఏదీ చేసినా రెట్టింపు ఫలితం.. ఉసిరిని దానం చేస్తే?
సోమవారం, 23 నవంబరు 2020 (10:11 IST)
Amla
కార్తీక మాసం శుక్లపక్షం నవమిని ''అక్షయ నవమి''గా పేర్కొంటారు. ఈ తిథికి అక్షయ తృతీయ శుభ దినానికి వుండే ప్రాముఖ్యత ఉంది. అక్షయ నవమిని ప్రభోదిని ఏకాదశికి రెండు రోజుల ముందు జరుపుకుంటారు. అక్షయ నవమి రోజున సత్య యుగం ప్రారంభమైందని చెప్తారు. ఈ రోజును అన్ని రకాల పుణ్య కార్యాలు చేసేందుకు అనుకూలం. ఈ రోజునే ఉసిరి నవమిగానూ జరుపుకుంటారు. ఈ రోజున ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించడం విశేషం.
అక్షయ నవమి రోజున, భక్తులు ఉదయాన్నే లేచి , సూర్యోదయ సమయంలో గంగానదితో పాటు ఇతర పవిత్ర నదులలో స్నానం చేస్తారు. స్నానం చేసిన తరువాత పితృదేవతలకు అర్ఘ్యమివ్వడం చేస్తారు. బ్రాహ్మణులకు దానం ఇవ్వడం చేస్తారు. ఈ రోజున చేసే దానాలు, పూజలు రెట్టింపు ఫలితాలను ఇస్తుంది.
ఈ రోజున ఉప్పు వేసిన ఆహారాన్ని తీసుకోకుండా ఉపవసించాలి. అలాగే కార్తీక సోమవారం ఇందుకు తోడు కావడం ఈశ్వర అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఈ రోజున ఉసిరి పండ్లను దానం చేయాలి. పండ్లను కూడా దానంగా ఇవ్వొచ్చు. అక్షయ నవమి రోజున చేసిన ఏ కార్యమూ పరాజయం చవిచూడదని విశ్వాసం. ఈ రోజున రహస్య విరాళాలు చేయడం కూడా చాలా ప్రాముఖ్యత. అర్హత ఉన్న వ్యక్తికి వారి ఆర్థిక పరిస్థితి ప్రకారం వీలైనంత వరకు విరాళం ఇవ్వాలి.
Amla Tree Puja
అక్షయ నవమి రోజున చేసే ప్రార్థనలు అన్ని కోరికలను నెరవేరుస్తాయి. చివరికి వ్యక్తిని మోక్షం లేదా విముక్తి మార్గంలో నడిపిస్తాయి. ఈ రోజున స్వచ్ఛంద కార్యకలాపాలు చేయడం వల్ల రాబోయే జీవితకాలం వ్యక్తికి ప్రయోజనం ఉంటుంది. అందుకే అక్షయ నవమి నాడు విష్ణు విజయ స్తోత్రం, కనకధారా స్థవం, దుర్గా స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం వంటి స్తోత్రాలను పఠించాలి. ఇంకా స్వామికి చక్కెర పొంగళి , దద్ధోజనం నైవేద్యంగా సమర్పించవచ్చు. అక్షయ నవమినాడు చేసే పూజతో పాపాలు నశిస్తాయి. ధనలాభం వుంటుంది. శత్రువులపై విజయం, అధికార ప్రాప్తి లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
అలాగే ఈ రోజున ఉసిరి చెట్టుకు పూజలు చేసే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఉసిరి చెట్టులో శివకేశవులు కొలువై వుంటారని విశ్వాసం. ఈ రోజున ఉసిరి చెట్టుకు పూజ, దీపం వెలిగించడం.. ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
పూర్వం శ్రీలక్ష్మీ దేవి భూమిపైకి వచ్చిందని.. ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుందని.. ఇద్దరినీ ఒకే సమయంలో పూజించడం సాధ్యమనుకుందట. అందుకే ఆమె ఉసిరి చెట్టును ఎంచుకుందని.. ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల ప్ర్రీతికి పాత్రమైందని పురాణాలు చెప్తున్నాయి. ఇంకా శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఆమె గుర్తించింది. అందుకే ఈ రోజున ఉసిరి చెట్టు కింద పూజ చేయాలని పండితులు అంటుంటారు.
Siva kesava
అందుకే ఉసిరి చెట్టు కింద శుభ్రపరిచి తరువాత తూర్పు దిశలో నిలబడి దానికి నీరు, పాలను అందించాలి. పూజ తరువాత, భక్తులు చెట్టు చుట్టూ పత్తిని చుట్టి, ప్రదక్షిణలు చేస్తారు. చివర్లో ఉసిరి కాయ దీపంతో దీపారాధన చేస్తారు. ఇలా చేయడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. ఇంకా హరిహరాదుల అనుగ్రహం లభిస్తుంది.