ఈ రాశివారికి గురుసంచార ప్రభావం వల్ల సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోను ధైర్యంగా ముందుకు సాగుతారు. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వాక్పటిమతో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. కీలక వ్యవహారాలు వీరి సమక్షంలో సాగుతాయి. ఆర్థికలావాదేవీలు ఫలిస్తాయి. ఆదాయం బాగుంటుంది.
ఊహించిన ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. వాహనం, ఖరీదైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఇదీ ఒకందుకు మంచి పరిణామమే.
బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. నిర్మాణాలు, వాస్తుదోష నివారణ చర్చలు చేపడతారు. ప్రేమానురాగాలు బలపడతాయి. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. తరచు శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్లకండి. నగదు, ఆభరణాలు చోరీకి గురయ్యే సూచనలున్నాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. స్థిరచరాస్తుల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి.
భేషజాలు, మొహమ్మాటాలకు పోయి ఇబ్బందులెదుర్కుంటారు. సంస్థలు, పరిశ్రమల స్థాపనకు అనుమతులు మంజూరవుతాయి. రిటైర్డు ఉద్యోగస్తులు, అధికారులకు రావలసిన బెనిఫిట్స్ అంత తొందరగా రావు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉమ్మడి వ్యాపారాలపై దృష్టి పెడతారు.
వ్యవసాయ తోటల రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. ఆధ్యాత్మికత, సేవాభావం పెంపొందుతాయి. ఆలయాలకు విరాళాలు, ఖరీదైన కానుకలు సమర్పించుకుంటారు. ఈ రాశివారికి వరసిద్ధి వినాయకుని ఆరాధన, అమ్మవార్లకు కుంకుమార్చనలు శుభదాయకం.