తులసీ వ్రతాన్ని 26 శుక్రవారాలు ఇలా ఆచరించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ప్రతి శుక్రవారం ఉదయం తలస్నానం చేసి తులసీ చెట్టుకు మూడు ప్రదక్షణలు మూడు నమస్కారములు చేసి అక్షతలను తల మీద ధరించాలి. అంతేగాకుండా తులసీ చెట్టు వద్ద మట్టి ప్రమిదెతో దీపారాధన చేసి పసుపు రాసి కుంకుమ బొట్టు వుంచాలి. ఉద్యాపన రోజున 26 జతల అరిసెలు తయారు చేసుకోవాలి.
ఉదయము నిద్రనుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది. తులసిచెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరిక, మానసిక ఆరోగ్యమునిస్తుంది.
తులసి చెట్టు నుండి దళాలను మంగళ , శుక్ర , ఆది వారములలో, ద్వాదశి , అమావాస్య , పూర్ణిమ తిథులలో, సంక్రాంతి, జనన మరణ శౌచములలో, వైధృతి వ్యతీపాత యోగములలో త్రెంప కూడదు . ఇది నిర్ణయసింధులో, విష్ణుధర్మోత్తర పురాణంలో తెలియజేయబడినది.
తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణం అయినట్లు కాదు. ఇది వరాహ పురాణంలో చెప్పబడింది. కాబట్టి నిషిద్ధమైన రోజులలో, తిథులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలి పడిన ఆకులతో, దళములతో పూజ చేయాలి. ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసి దళములను త్రెంపి దాచుకొని మరుసటి రోజు ఉపయోగించాలి.