జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి దేవుడైన గణేశుడికి ప్రత్యేక ఆరాధనలను సంకష్టహర చతుర్థి రోజున చేస్తారు. కృష్ణపక్షంలో నాలుగో రోజున ఈ తిథి వస్తుంది. ఇది మాసానికి ఒకసారి వచ్చినా.. కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థి అని గుర్తిస్తారు.
లక్షలాది మంది భక్తులు ప్రతి నెల క్షీణిస్తున్న చంద్రుని నాల్గవ రోజున గణేశునికి పూజలు, అభిషేకాలు చేస్తారు. ఆయనకు ఇష్టమైన మోదకాలు నైవేద్యంగా సమర్పించుకుంటారు. 'సంకటహర' అనే పదానికి కష్టాలను తొలగించేవాడు అని అర్థం. అందుకే ఈ రోజున వినాయకుడిని పూజించడం ద్వారా జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. అదృష్టం వరిస్తుంది.
ఈ ప్రపంచానికి ప్రకాశాన్ని ఇచ్చే సూర్యనారాయణుడు తన జీవితంలోని అన్ని అడ్డంకులు, బాధలను తొలగించుకోవడానికి సంకష్టహర చతుర్థి రోజున ఉపవాసం పాటించి, గణేశుడిని పూజించినట్లు పురాణాలు చెప్తున్నారు. ఈ వ్రతాన్ని సూర్యభగవానుడిని ఆచరించమని నారద మహర్షి సూచించినట్లు చెప్పబడింది. నారద మహర్షి సూచన మేరకు సూర్యుడు గణేశుడిని పూజించి తన అడ్డంకులకు తొలగించుకున్నాడు.
ఈ రోజున తెల్లవారుజాము నుండి సూర్యాస్తమయం వరకు చంద్రోదయం వరకు కఠినమైన ఉపవాసం ఉండాలి. కొందరు పండ్లు, పాలు లేదా ఇతర తేలికపాటి ఆహారాలు తీసుకుంటూ పాక్షిక ఉపవాసం ఉంటారు. సంకటహర చతుర్థి ఉపవాస నియమాలు చంద్రుడిని చూడటం, గణపతి పూజ చేయడంతో ముగుస్తాయి.
గణపతికి ఈ రోజున భక్తులు పువ్వులు, మోదకాలు, పండ్లు, కొబ్బరికాయ సమర్పిస్తారు. గణేశుడికి ఇష్టమైన మంత్రాలతో జపిస్తారు. సంకటహర చతుర్థిలో చంద్రుడికి కూడా ప్రాముఖ్యత ఉంటుంది. పూజ పూర్తయిన తర్వాత, ప్రజలు చంద్రోదయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. చంద్రుడిని ఈ సందర్భంగా ప్రార్థిస్తారు. చంద్రదర్శనం తర్వాత ఉపవాసం విరమిస్తారు.