ఆ మూడు రోజులు చాలా ముఖ్యమట? (video)

శుక్రవారం, 2 ఆగస్టు 2019 (13:17 IST)
శ్రావణ మాసం మొదలైంది. శ్రావణమాసం అంటే శ్రీ మహావిష్ణువుకు, శ్రీ మహాలక్ష్మీకి అత్యంత ప్రీతికరం. చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం సంవత్సరంలో ఐదవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం "శ్రవణా నక్షత్రం" కాబట్టే. ఈ నెలకు శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. 
 
శ్రావణమాసంలో మంగళ, శుక్ర, శని అనే మూడు వారాలు ప్రధానం. శ్రావణ మాసంలోని మంగళవారాలు శ్రీగౌరీ పూజకు, శుక్రవారాలు శ్రీలక్ష్మీ పూజకు, శనివారాలు శ్రీమహావిష్ణువు పూజకు ఉత్తమమమైనవి.  
 
ఇంకా శ్రావణమాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికం ఈ మాసంలోనే ఉండడంవల్ల వ్రతాలమాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది. శ్రావణమాసంలో ఆచరించే వ్రతాల్లో ముఖ్యమైనది మంగళగౌరీ వ్రతం. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు చేయాలి. నెలలోని అన్ని మంగళవారాలు దీనిని చేయవలెను.
 
మహిళలకు అత్యంత ముఖ్యమైన శ్రావణమాసంలో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరించాలి. ఇంకా శ్రావణ మాసంలో రాఖీ పూర్ణిమ, హయగ్రీవ జయంతి, శ్రీకృష్ణాష్టమి, కృష్ణపక్ష ఏకాదశి, కృష్ణపక్ష అమావాస్య వంటి పండుగలను జరుపుకుంటారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు