పురాణాల ప్రకారం.. యమునా నది- యమధర్మరాజుకు చెల్లెలు. ఆమెకు అన్నగారంటే వల్లమాలిన ఆపేక్ష. తన ఇంటికి రమ్మని, తన చేతివంట భుజించి వెళ్ళమని, ఎన్నిసార్లో సోదరుణ్ని ఆమె అభ్యర్థించింది.
అందుకే ప్రతిఏటా కార్తీక శుద్ధ విదియ 'భగినీ హస్తాన్న భోజనం' అని పిలవడం మొదలైంది. ఆ రోజు ఏ స్త్రీ తన సోదరులను పిలిచి అన్నంపెట్టి ఆదరిస్తుందో- ఆమె జీవితాంతం సుమంగళిగా జీవిస్తుందని, భోగభాగ్యాలతో తులతూగుతుందని యముడు వరం ప్రసాదించాడు.