అష్టమి, చతుర్ధశి, పూర్ణిమ, అమావాస్య గ్రహణాలు ఇవన్నీ సంధికాలాలు. సూర్యునికి భూమికిగల సంబంధంలో విషమత్వం ఏర్పడుతుంది. ఈ రోజుల్లో అభ్యంగన స్నానం చేయకూడదు. నిషిద్ధ దినాల్లో అభ్యంగన స్నానం చేయడం వల్ల చర్మవ్యాధులు వ్యాపిస్తాయి.
శ్లో|| తైలాభ్యంగే రవౌతాపః సోమే శోభా కుజే మృతిః!
బుధౌ ధనం గురౌ హానిః శుక్రేసుఖం శనౌ సుఖమ్||
ఆదివారం తలంటుపోసుకోవడం వల్ల అధికతాపం ఏర్పడుతుంది. ఎందుకంటే ఆదివారానికి సూర్యునితో సంబంధం ఉంది. సూర్యుడు ప్రపంచానికి వేడి, వెలుగు ప్రసాదిస్తున్నాడు. శరీరం దృఢంగా ఉండడానికి తగినంత వేడి అవసరం. అది లభించనపుడు అగ్నిమాంధ్యమనే జబ్బు చేస్తుంది.
దానివల్ల ఆకలి తగ్గిపోతుంది. జీర్ణశక్తి తగ్గుతుంది. నానాటికి శరీరం బలహీనపడుతుంది. శరీరపుష్ఠికి వేడిని కలిగించుకొనవలసిందే. నేయి బుద్ధిని వికసింపజేస్తుంది. పుష్టిని కలిగిస్తుంది. కాని మితిమీరి ఉపయోగిస్తే కీడు కలుగుతుంది.
ఈ సిద్ధాంతాన్నే ఆదివారం తైలమర్దనానికి సమన్వయపరచవచ్చు. శరీరములో ఉష్టం ఎక్కువే. అందువల్ల ఆదివారం విందు భోజనాలు చేయరాదు. ఉపవాసము చేయడం అన్ని విధాలా ఆరోగ్యప్రదం.
కానీ మనం ఆదివారమే మాంసాహారాన్ని తెగలాగిస్తుంటాం. కానీ ఇలాంటివి ఆదివారం పూట చేయకూడదని పండితులు అంటున్నారు. పూర్తి ఉపవాసం చేయలేకపోతే ఉప్పు, నూనె, కారం లేని పదార్థములను ఉపయోగించవచ్చు. పండ్లు, పాలు తీసుకోవచ్చు.
ఇంకా ఆదివారం స్త్రీ సంభోగాన్ని, తైలమర్దనమును, మాంస భక్షణమును, మద్యపానమును నిషేధించారు. కానీ ఈ రోజుల్లో ఆదివారం సెలవు వస్తందని అభ్యంగన స్నానము చేస్తున్నారు. విందు భోజనాలు చేస్తున్నారు. మద్యపానం చేసి విలాసాలతో కాలక్షేపం చేస్తున్నారు. కానీ ఇవన్నీ సరికాదని పండితులు చెబుతున్నారు.