కామినీ కాంచనాల నడుమ జీవిస్తుంటే యోగం ఎలా సిద్దిస్తుంది. వాటి నడుమ అనాసక్తుడై జీవించడం చాలా కష్టం... ఒక వైపు భార్యకు గులాము, మరొకవైపు డబ్బుకు గులాము, ఇంకొక వైపు తాను పని చేసే యజమానికి గులాము. దీనికి ఉదాహరణగా ఒక కథ చెబుతాను... అది డిల్లీ పాదూషాగా అక్బర్ రాజ్యం చేసే కాలం. ఆ రాజ్యంలో ఒక ఫకీరు అడవిలో ఒక కుటీరంలో నివసించేవాడు. ఫకీరు వద్దకు తరచూ సందర్శకులు వస్తుండేవారు. ఆ వచ్చిన వారికి బాగా మర్యాద చేయాలని ఫకీరుకు ఎంతో కోరికగా ఉండేది. అయితే అందుకు ధనం కావాలి కదా.
అందుకని అతడు ఇలా తలచాడు. అక్బరు వద్దకు వెళ్లి ఇందు నిమిత్తం ధనం యాచిస్తాను. అక్బరు ఇంటి తలుపులు సాధువులకు, ఫకీర్లకు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి కదా... అనుకుని అక్బరు వద్దకు బయలుదేరాడు. ఫకీరు అక్బరు వద్దకు వెళ్లిన సమయంలో ఆయన నమాజు చేస్తున్నాడు. ఫకీరు కూడా అక్కడే కూర్చున్నాడు. అక్బరు నమాజు చేసేటప్పుడు యా అల్లా నాకు సిరిసంపదలు ప్రసాదించు...... అంటూ ప్రార్థించడం ఫకీరు విన్నాడు. అది వినగానే ఫకీరు లేచి వెళ్లిపోసాగాడు. అక్బరు సైగ చేసి అతణ్ణి ఆగమని చెప్పాడు. నమాజు పూర్తి చేశాక ఆయన ఫకీరును మీరు వచ్చి కూర్చున్నారు, మళ్లీ వెళ్లిపోతున్నారే... మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు ఫకీరు ఇది పాదుషా వారు వినవలసిన విషయం కాదు. నేను వెళతాను అన్నాడు.
కారణం ఏమిటో చెప్పమని అక్బరు పట్టుబట్టడంతో ఫకీరు ఇలా చెప్పాడు. నా కుటీరానికి ఎంతోమంది అతిథులు వస్తూ ఉంటారు. వారికి మర్యాద చేయడానికి అవసరమైన ధనం యాచించే నిమిత్తం ఇక్కడకు వచ్చాను. మరి అలాంటప్పుడు ధనం కోరకుండానే వెళ్లిపోతున్నారెందుకు అని అక్బరు అడగడంతో ఫకీరు ఇలా బదులిచ్చాడు. నువ్వు కూడా సిరిసంపదల కోసం యాచించడం చూశాను. అలాంటప్పుడు ఒక యాచకుని మళ్లీ యాచించడమెందుకు.... కావాలంటే ఆ అల్లానే యాచిద్దామనుకుని వెళ్లిపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.