తిరుమల శ్రీవారిని ప్రతిరోజు వేలాదిమంది దర్శించుకుంటుంటారు. స్వామివారికి మ్రొక్కులు కూడా హుండీ ద్వారా తీర్చుకుంటారు. 2 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల వరకు శ్రీవారికి హుండీ ఆదాయం వస్తుంది. అలాంటి హుండీకే కన్నం వేయాలని తితిదే అధికారులు భావించారేమో.. ఏకంగా హుండీకి తాళం వేయడం మరిచిపోయారు. హుండీ నిండిపోయి డబ్బులన్నీ కిందపడిపోయాయి. వీటిని తితిదే ఉద్యోగస్తులే తీసుకుని వెళ్లిపోయారన్న ఆరోపణలు లేకపోలేదు.
ఆరోజు ఉదయం 10.30 నుంచి 11గంటల సమయంలో ఛైర్మన్ ఆలయం లోపలికి వచ్చారు. సన్నిధికి చేరుకున్నారు. అంతకుముందే సిబ్బంది. నిండిన హుండీ తీసుకొచ్చి సన్నిధిలో పెట్టారు. నేరుగా హుండీ వద్దకు వెళ్ళిన ఆయన హుండీకి సీలు వేయకపోవడాన్ని గమనించారు. అంతే ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అది పవిత్రమనే ఆలయమనే సంగతి కూడా మరిచిపోయి సంయమనం కోల్పోయి బూతులు తిట్టారట. హుండీలో డబ్బులంతా ఎత్తుకుని పోతా ఉండారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట.
తితిదే ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగానే తితిదే ఉద్యోగుల తీరు కూడా ఉంది. నిజంగానే హుండీకి తాళం వేయకుండా, హుండీ నిండిపోయి డబ్బులు కిందపడిపోతున్నా తితిదే ఉద్యోగస్తుల్లో చలనం లేదు. అంతేకాదు హుండీలో డబ్బులు వేసే సమయంలో భక్తులకే డబ్బులు చేతులు తగులుతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. డబ్బు నిండిపోయింది.. హుండీ మార్చండి అంటూ భక్తులు చెప్పినా పట్టించుకోకపోగా తాళాలు వేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. తాళం వేయకపోవడంపై తితిదే ఛైర్మన్ సీరియస్‌గా తీసుకుని విజిలెన్స్ విచారణకు ఆదేశించారట. మొత్తం మీద శ్రీవారి హుండీకే తితిదే ఉద్యోగులు కన్నం వేయడానికి ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది.