నాగపడగ నీడన ఆ తల్లి మనోహరంగా దర్శనమిస్తూ..?

బుధవారం, 22 మే 2019 (16:27 IST)
చాలా ఆలయాల్లో నాగ దేవతలు విగ్రహమూర్తులుగా కనిపిస్తారు, కొన్ని చోట్ల పుట్టలకు కూడా నాగ పూజలు చేస్తారు. అయితే ఒక నాగుపాము నేరుగా వచ్చి ఒకే ప్రదేశంలో కొన్ని రోజుల పాటు ఉండి అక్కడే ఆవిర్భవించిన క్షేత్రంగా వరాల నాగమ్మ తల్లి క్షేత్రం కనిపిస్తుంది. ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామంలో ఉంది. భక్తులకు కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. 
 
కొంత కాలం క్రితం స్వయంగా నాగుపాము వచ్చి తేజస్సును ఆవిష్కరిస్తూ ఎక్కడైతే ఆవిర్భవించిందో అక్కడే ఆలయాన్ని నిర్మించారు. పచ్చని పంటపొలాల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం వెలుగొందుతోంది. గర్భాలయంలో నాగదేవత రూపం పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. ప్రతి మంగళవారం అభిషేకం జరిపించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. 
 
ఈ తల్లిని మనసారా మొక్కితే ఆపదలు గట్టెక్కుతాయి. కష్టాలు దూరం చేస్తుంది, భక్తి శ్రద్ధలతో పూజిస్తే భక్తుల ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేరుస్తుంది. ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల అనారోగ్యాలు తొలగిపోతాయనీ, సర్పదోషాలు, కుజదోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ దేవాలయంలో నాగపడగ నీడన ఆ తల్లి మనోహరంగా దర్శనమిస్తుంది. 
 
ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఘనంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్య షష్టి రోజున, నాగపంచమి, నాగులచవితి రోజున అమ్మవారి దర్శనానికి భక్తులు విశేషంగా తరలివస్తుంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు