అతి పురాతన సిద్ధనాథ్ మహదేవ్ ఆలయం

WD PhotoWD
ఈ వారం తీర్థయాత్రలో భాగంగా.. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని నర్మదా తీరంలో వెలసివున్న సిద్ధనాథ్ మహాదేవ్ ఆలయ ప్రాశస్త్యాం తెలుసుకుందాం. ఈ ఆలయం నర్మదా తీరంలోని నేమవర్ అనే పట్టణంలో వెలసివుంది. అతిపురాతనమైన ఈ శివాలయం సిద్ధనాథ్ పేరుతో భక్తులకు సుపరిచితం. దేశంలోని వాణిజ్య ప్రాంతాల్లో ఒకటిగా వున్న నాభివూర్‌కు ప్రాంతానికి సమీపంలో ఉంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని సనంద్, సనక్, సనాతన్, సనాత్ కుమార్ అనే నలుగురు సిద్ధ ఋషులు ప్రతిష్టించడం వల్ల ఈ ఆలయాన్ని సిద్ధనాథ్ ఆలయం అనే పేరు వచ్చినట్టు భక్తులు అభిప్రాయపడుతారు.

ఈ శివాలయాన్ని క్రీ.పూ.3094 సంవత్సరంలో నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు చెపుతున్నాయి. ఆరంభంలో ఆలయ ముఖద్వారం తూర్పు దిశగా ఉండేదని, పంచపాండవుల్లో ఒకరైన భీముడు పశ్చిమవైపుకు తిప్పినట్టు చెప్పుకుంటారు.

ప్రతి రోజు ఉదయం.. నదీతీరంలోని ఇసుక మేటలపై అతిపెద్ద పాదముద్రికలు కనిపిస్తుంటాయి. ఇవి నలుగురు సిద్ధ ఋషుల పాద ముద్రలుగా ఇక్కడికి వచ్చే భక్తులు భావిస్తుంటారు. అంతేకాకుండా.. చర్మ వ్యాధులు ఉన్న వారు ఈ ఇసుకలో అంగప్రదక్షిణం చేస్తే వ్యాధి పూర్తిగా నయమవుతుందని భక్తులు భావిస్తుంటారు.

WD PhotoWD
అలాగే.. ఈ ఆలయానికి సమీపంలోని పలు గుహల్లో సిద్ధులు నివశిస్తున్నట్టు, వారు వేకువజామున నర్మదా నదిలో స్నానమాచరించి వెళుతున్నట్టు స్థానికులు పేర్కొంటున్నారు. ఆలయం చుట్టూత ఉన్న గోడలపై హిందూ, జైన మత విషయాలు, వాటి ప్రాముఖ్యతను లిఖించినట్టు పేర్కొంటారు. వీటిని పూర్తిగా పఠించిన వారు తప్పుకుండా మోక్షం పొందుతారని ఇక్కడకు వచ్చే భక్తుల విశ్వాసం.

ప్రతినెల అమవాస్య, పౌర్ణమి రోజులతో సహా సంక్రాంతి, శివరాత్రి వంటి పర్వదినాల్లో వేలాది మంది భక్తులు ఇక్కడకు వచ్చి నర్మదా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి తమ ఇష్టదైవాన్ని దర్శనం చేసుకుని వెళుతుంటారు.

ఆలయాన్ని గత 10, 11 శతాబ్దాలలో ఆధునకీకరించారు. ఆలయానికి చుట్టూత ఉన్న గోడలకు అందమైన శిలలను అమర్చారు. ఆలయ గోడలు, స్తంభాలకు శివుడు, భైరవుడు, గణేష్, ఛాముండేశ్వరుడు, ఇంద్రుడు తదితర దేవుళ్ళ శిల్పాలు ఉన్నాయి. అన్ని రోజుల్లో ఆలయాన్ని తిలకించేందుకు భక్తులు తరలి వస్తుంటారు. దీంతో ఈ ఆలయం ఎపుడు చూసినా భక్తులతో నిత్య సందడిగా కనిపిస్తుంది.

ఎలా వెళ్ళాలి:
రోడ్డు మార్గం: ఇండోర్ నుంచి 130 కిలోమీటర్లు, భోపాల్‌ నుంచి 170 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంది.

రైలు మార్గం: ఢిల్లీ-ముంబై మార్గమధ్యంలో హర్ధా రైల్వే స్టేషన్‌ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం వెలసి వుంది.