మహా కేధారేశ్వర్ ఆలయం...!

FileFILE
భక్తి... భగవంతునికి, భక్తునికి మధ్య విభజించలేని ప్రత్యేక బంధం. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చే భక్తుడు దైవ సన్నిధికి చేరుకునేందుకు భక్తులు వస్తుంటారు. తమ ఇష్టదైవాన్ని దర్శించుకుని ముక్తి మార్గానికి చేరుకునేందుకు మార్గాన్వేషణ చేస్తారు. అయితే మా తీర్థయాత్రలో భాగంగా.. ఈ వారం శివసన్నిధిని మీకు పరిచయం చేస్తున్నాం. ఈ పుణ్యస్థలమే మహా కేధారేశ్వర్ ఆలయం.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాట్లమ్ అనే ప్రాంతానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైలానా అనే ప్రాంతంలో ఈ ఆలయం వుంది. ఇక్కడకు ఆ రాష్ట్రానికి చెందిన భక్తులు మాత్రమే కాకుండా.. దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయం కనువిందు చేసే పచ్చటి కొండలు, ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగివుండే రమణీయ ప్రకృతి అందాలు, పాలవన్నెలాంటి నీటి జలపాతాల మధ్య వెలసి వుంది.

ఈ ఆలయానికి 278 సంవత్సరాల చారిత్రక నేపథ్యం వుంది. అంటే.. 1730 సంవత్సరంలో సహజసిద్ధంగా ఇక్కడ శివలింగం వెలసినట్టు పేర్కొంటారు. ఆ తర్వాత అంటే.. 1736లో సైలానా మహారాజు జయసింగ్‌ అందమైన ఆలయాన్ని నిర్మించారు. గత 1959-95 సంవత్సరాల మధ్య రాజు తులసింగ్ అందజేసిన రూ.1.50 లక్షల నిధులతో ఆలయం జీర్ణోద్ధరణ పనులు పూర్తి చేశారు.

WD PhotoWD
ఆలయం సమీపంలో కోనేరు కూడావుంది. రాజు జశ్వంత్ సింగ్ కాలంలో ఆలయ పూజారులకు స్థలాన్ని పంపిణీ చేశారు. 1992-92 సంవత్సరంలో రాట్లమ్ జిల్లా అధికారయంత్రాంగం అందజేసిన రూ.రెండు లక్షలతో ఆలయానికి మరోమారు జీర్ణోద్ధరణ పనులు చేశారు.

ఆలయ అర్చకుడు అవంతిలాల్ త్రివేది మాట్లాడుతూ.. సైలానా రాజుల కాలం నుంచి ఈ ఆలయం ఉంది. నాలుగో తరానికి చెందిన తాము మహేశ్వరునికి పూజలు చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకు తరలి వచ్చి తమ ఇష్ట దైవాన్ని పూజిస్తారని చెప్పారు.

ప్రతి ఏడాదిలో వచ్చే మహాశివరాత్రి, విశాఖ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి వంటి పర్వదినాల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రావణ మాసంలో ప్రతి రోజు వందలాది మంది భక్తులు ఆలయానికి వచ్చి తమ ఇష్టదైవాన్ని దర్శనం చేసుకుంటారు.

ఈ ప్రాంతానికి ఎలా చేరుకోవాలి.
రోడ్డు మార్గం.. రాట్లమ్ అనే ప్రాంతం నుంచి బస్సులు, టాక్సీలలో ఆలయానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం.. మధ్య రైల్వేలో పరధిలోని ఢిల్లీ-ముంబై మార్గంలో ఉన్న రైల్వే స్టేషన్‌లలో రాట్లమ్ ప్రధానమైంది.

విమానయాన మార్గం.. ఆలయానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవి అహల్యా హోల్కర్‌ విమానాశ్రయం ఎయిర్‌పోర్టు. ఇదే ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న విమానాశ్రయం.