ధర్మరాజు నిర్మించిన బాగ్లాముఖి ఆలయం

ఆదివారం, 2 నవంబరు 2008 (17:03 IST)
తంత్రాలను ఆధారంగా చేసుకుని లిఖించబడిన పురాతన గ్రంథాల్లో పది మహావిద్యాస్‌ ప్రస్థావన ఉంది. వీటిలో ఒకటి బాగ్లాముఖి ఒకటి. దేవతామూర్తుల్లో బాగ్లా‌ముఖీ దేవతకు ఒక ప్రత్యేకస్థానం ఉంది. బాగ్లాముఖి మాతకు కేవలం మూడు పురాతన ఆలయాలు మాత్రమే ఉన్నాయి. వీటిని సిద్ధపీఠాలుగా పిలుస్తారు. వీటిలో ఒకటి నల్కేఢాలో ఉంది. ఈ వారం తీర్థయాత్రలో భాగంగా.. నల్కేఢాలో ఉన్న బాగ్లాముఖీ దేవత గురించి మీకు పరిచయం చేస్తాం.

బాగ్లాముఖి దేవతకు దేశంలో మూడు ప్రధాన ఆలయాలు ఉన్నాయి. ఇవి మధ్యప్రదేశ్‌లోని దతియా, హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్డా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని షాహజ్‌పూర్‌ జిల్లాలో ఉన్న నల్కేఢాలో ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.

వీటిలో ఒకటి మూడు ముఖాలు (త్రిముఖం) కలిగిన బాగ్లాముఖి మాత ఆలయం లఖుందర్ నదీతీరంలో వెలసివుంది. ఇది షాజ్‌పూర్ జిల్లాలోని నల్కేఢాలో ఉంది.
WDWD
ఈ ఆలయం ద్వాపర యుగానికి చెందినది కావడమే కాకుండా.. అత్యంత మహిమాన్మితమైనదిగా పేర్కొంటారు. దైవ శక్తులను పొందేందుకు దేశంలోని నలుమూలల నుంచి సాధువులు, సన్యాసులు ఈ ఆలయానికి వచ్చి, తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తారు.

ఈ ఆలయంలో బాగ్లాముఖి దేవత విగ్రహమే కాకుండా లక్ష్మీ, కృష్ణ, హనుమాన్, భైరవ్, సరస్వతి విగ్రహాలు కూడా ఉన్నాయి. మహాభారత యుద్ధంలో విజయుడైన యుధిష్టురుడు శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పేర్కొంటారు. అంతేకాకుండా.. ఆలయంలోని బాగ్లాముఖి విగ్రహం స్వయంభుగా వెలసినట్టు ఇక్కడి భక్తుల భావన.

WDWD
ఆలయంలోని పూజారి కైలాష్ నారాయణ్ శర్మ మాట్లాడుతూ.. ఈ ఆలయం అతిపురాతనమైనదని, ఆలయంలో కొలువైన అమ్మవారిని పదో తరం నుంచి పూజారులు కొలుస్తున్నట్టు చెప్పారు. ఆలయానికి తొలిసారి 1815 సంవత్సరంలో జీర్ణోద్ధారణ పనులు పూర్తి చేశారు. తమ కోర్కెలు, కష్టాలు తీరేందుకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి యాగాలు, హోమాలు నిర్వహిస్తుంటారని తెలిపారు.

ఆలయంలోని మిగిలిన పూజారులైన గోపాల్ పాండా, మనోహర్‌లాల్ పాండా తదితరులు మాట్లాడుతూ.. తాంత్రీకులు బాగ్లాముఖి దేవతను తమ ఆరాధ్య దేవతగా ఆరాధించేవారని తెలిపారు. తాంత్రీకులకు అత్యంత పుణ్యస్థలంగా ఈ ప్రాంతం పేరొందినట్టు చెప్పారు. ధర్మరాజు ఈ ఆలయాన్ని నిర్మించడం ఒక ప్రత్యేకతగాను, ఆలయంలోని బాగ్లాముఖి విగ్రహం స్వయంభుగా వెలవడం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

ఎలా చేరుకోవాలి
విమానమార్గం.. ఇండోర్ విమానాశ్రయానికి సమీపంలో నల్కేఢా ఆలయం వెలసివుంది.
రైలు మార్గం.. ఉజ్జయనీ లేదా దేవాస్ రైల్వే స్టేషన్లలో దిగి అక్కడ నుంచి టాక్సీలలో ఆలయానికి చేరుకోవచ్చు.
రోడ్డు మార్గం.. ఇండోర్ బస్‌స్టేషన్ నుంచి బస్సులు లేదా టాక్సీలలో చేరుకోవచ్చు. ఇండోర్ నుంచి నల్కేఢా‌ 165 కిలోమీటర్ల దూరంలో ఉంది.