సర్వ మతాలకు ప్రీతిపాత్రుడు వీర్ గోగాదేవ్

తీర్ధయాత్రలో భాగంగా ఈ వారం మిమ్ములను సిద్ధివీర్ గోగాదేవ్ ఆలయానికి తీసుకెళుతున్నాం, ఈ ఆలయం రాజస్తాన్‌ చూరు జిల్లాలోని దత్తఖేడ వద్ద ఉంది. అన్ని మతాల, కులాల ప్రజలు సుదూర ప్రాంతాలనుంచి ఇక్కడికి వచ్చి ప్రార్ధనలు చేస్తుంటారు. దత్తఖేడ అనేది గోగాదేవ్ జన్మస్థలం. నాథ్ కమ్యూనిటీకి చెందిన మహర్షులకు ఇది చాలా ముఖ్యమైన ఆలయంగా ఉంది.

మధ్యయుగాల్లో గోగోజా అనే వ్యక్తి లోకదేవత (సామాన్యుల దేవుడు)గా పేరుపొందారు. హిందూ, ముస్లిం, సిక్కు ఇలా అన్ని మతాలకు చెందిన ప్రజలు ఇతడి అనుచరులుగా ఉండేవారు. ఇతడు ఏ ఒక్క మతానికి చెందినవాడు కాదు. రాజస్తాన్‌లోని చూరు ప్రాంతానికి చెందిన దాడ్రెవా రాజపుట్ వంశంలో గోగాజి జన్మించారు. ఇతడి తండ్రి జైబర్ చూరు పాలకుడు.

తల్లి బచాల్. బాడవ్ నెలలో నవమి రోజున గురు గోర్ఘానాథ్ ఆశీర్వాదంతో ఇతడు జన్మించాడని ప్రతీతి. చౌహాన్ రాజవంశంలో, పృధ్వీరాజ్ చౌహాన్ తర్వాత గోగాజీ వీర్ సుప్రసిద్ధ పాలకుడుగా ఉండేవాడు. సట్లుజ్ నుంచి హాన్సీ (హర్యానా) వరకు ఇతడి సామ్రాజ్యం వ్యాపించి ఉండేది.
WD


స్థానిక విశ్వాసాల ప్రకారం గోగాజీ సర్పదేవత పూజలందుకునేవాడు. ప్రజలు ఇతడిని గోగాజీ చౌహన్, గుగ్గా, జహీర్ వీర్, జహీర్ పీర్ వంటి పలు పేర్లతో పిలిచేవారు. గురు గోరక్షనాథ్ ప్రధాన శిష్యులలో ఇతడు ఒకడిగా ఉండేవాడు. దత్తఖేడలో గురు గోరక్షనాథ్ ఆశ్రమం కూడా ఉంది. ఇక్కడ గోగాదేవ్‌జీ గుర్రంపై కూర్చున్న భంగిమలో ఒక విగ్రహం కూడా ఉంది. ఇతడికి ప్రార్థనలు చేసి పూజించేందుకోసం భక్తులు ఈ స్థలానికి వస్తుంటారు.

WD
గోగాదేవ్‌జీ జన్మస్థలం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో హనుమాన్ గడ్ జిల్లాలోని నోహర్ మండలంలో గోగామడి దామిన్ అనే స్థలం ఉంది. ఇక్కడే గోగాదేవ్‌జీ సమాధి ఉంది. ఇక్కడ ఇద్దరు పూజారులు ఉంటున్నారు. ఒకరు హిందూ. మరొకరు ముస్లిం. ఈ ప్రాంతంలో మత సామరస్యానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు. శ్రావణ మాసం నుంచి భాద్రపద మాసం వరకు ఇక్కడ ఒక ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవ కాలంలో లక్షలాది ప్రజలు గోగాదేవ్ ఆశీస్సుల కోసం వస్తుంటారు. ఆసమయంలో వాతావరణం మొత్తంగా భక్తి విశ్వాసాల మేలుకలయికగా వెలుగొందుతుంటుంది.

రాజస్థాన్ రాష్ట్ర సంస్కృతిలో గోగాదేవ్ ప్రభావాన్ని ఎవరయినా ఇట్టే పట్టేయవచ్చు. గోగాదేవ్ ఆదర్శ వ్యక్తిత్వం భక్తులను మిక్కుటంగా ఆకర్షిస్తూ ఉంటుంది. మానవజాతికి శుభం కలిగించేందు కోసం మహత్కార్యాలు చేయగలిగేలా గోగాదేవ్ ఆయన ఆదర్శాలు ఈనాటికీ భక్తులను ప్రభావితం చేస్తున్నాయని మేధావులు, చరిత్ర పరిశోధకులు చెబుతుంటారు.

ఎక్కడ ఉంది.. ఎలా వెళ్లాలి...?

సమీప విమానాశ్రయం జైపూర్‌లో 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. సదల్‌పూర్ రైల్వే సమీప రైల్వే స్టేషన్. దత్తఖేడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. జైపూర్ నుంచి మీరు సాదల్‌పూర్‌కు రైలుమార్గంలో కూడా చేరవచ్చు.

జైపూర్ నుంచి సాదల్‌పూర్‌కు 250 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గం ఉంది. భారతదేశంలోని అన్ని ప్రాంతాలతో ఇది అనుసంధానించబడి ఉంది. సాదల్‌పూర్ నుంచి దత్తఖేడ మధ్య దూరం 15 కిలోమీటర్లు. టాక్సీ, బస్సులు ఇక్కడినుంచి లభ్యమవుతుంటాయి.