తిరుమలలో గజరాజు రెచ్చిపోయింది.. మావటికి కాలు విరిగింది....

సోమవారం, 19 డిశెంబరు 2016 (12:36 IST)
తిరుమల. ఎప్పుడో నిత్యకళ్యాణం.. పచ్చతోరణం. ఎప్పుడూ ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. ఆ ఉత్సవాలకు గజరాజులను వాహనసేవలకు ఉపయోగిస్తుంటారు. తిరుమలేశుడికి నిత్యం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది. ఆ తర్వాత శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామి తిరువీధుల్లో ఊరేగుతూ ఆలయానికి చేరుకుంటారు. దేవతామూర్తుల ఊరేగింపు సంధర్భంగా ముందు భాగంలో రెండు గజరాజులు నడుస్తాయి. ఊరేగింపులో పాల్గొనడానికి అవనిజ, లక్ష్మి అనే ఏనుగులను శ్రీవారి ఆలయం ఎదుటకు సాయంత్రం మావటిలు తీసుకువస్తున్నారు. 
 
ఎప్పటిలాగానే ఆదివారం సాయంత్రం వరాహస్వామివారి ఆలయం దాటి తూర్పు మాఢావీధిలోకి ప్రవేశించే సమయంలో ఒక్కసారిగా అవనిజ ఘీంకరిస్తూ పరుగులు పెట్టే ప్రయత్నం చేసింది. మావటి గంగయ్య దాన్ని అదుపుచేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఆగ్రహించిన ఏనుగు తొండంతో కొట్టింది. దీంతో గంగయ్య పక్కనే ఉన్న గ్యాలరీలోకి ఇనుప గ్రిల్స్‌పై పడిపోయాడు. గంగయ్యకు తీవ్రగాయాలయ్యాయి. శ్రీవారి భక్తులే గంగయ్యను రక్షించే ప్రయత్నం చేశారు.
 
అప్పటికే అవనిజ భక్తుల పైకి వెళ్ళడానికి ప్రయత్నించింది. అయితే భక్తులందరూ భయపడి అక్కడి నుంచి పరుగులు తీశారు. మావటీలు వెంటనే అవనిజను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. గంగయ్యను వెంటనే తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గంగయ్య కాలు, చేతి వేలు విరిగినట్లు తిరుమల అశ్విని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
 
అవనిజ ఏనుగు రెచ్చిపోవడం ఇది మొదటిది కాదు. ఎప్పటి నుంచో ఇదే విధంగా భక్తులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. అయినా తితిదే అధికారులు మాత్రం అవనిజను మాత్రం స్వామివారి వాహనసేవలకు ఉపయోగిస్తుండటం పలు విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా అవనిజకు తగిన శిక్షణ ఇచ్చి భక్తులను భయబ్రాంతులకు గురిచేయకుండా అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

వెబ్దునియా పై చదవండి